పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము

మదనసింగు పాలిగ్రామమును విడిచిపోయిన తరువాత హేమలత కొన్ని దినములవఱకు మునుపటివలె నన్నపానాదులపై నిష్టము నిలుపక బెంగఁగొని చిక్కియుండెను. కాని ప్రాఁత బడిన వెనుక యధాస్థితి కామె మరలవచ్చి సుఖముగా నుండినను రాజకుమారుని యందమును మృదు మధుర భాషణంబులును మఱవక యెల్లప్పుడు తలంచుకొనుచుండెను. నారాయణసింగు మదనసింగు తననిమిత్త మెన్నఁడు వర్తమానమంపునో యెన్నఁడు తాము తురుష్క రాజ్యపు సరిహద్దులఁ బాసి చిత్తూరు రాజ్యమున సుఖముగా నుందుమో యని యెదురుచూచుచు నామార్గమున బోవు బాటసారులనెల్లఁ బరీక్షించి యడుగచు దినమొక యేఁడుగ గడుపుచుండెను. మౌలవికిని, నారాయణసింగునకు స్నేహము నానాటి కధికమైనందునఁ బ్రజలు వారిమైత్రికి మిగులనానందించుచుండిరి. నారాయణసింగునకును మనుమరాలిని రహిమాను ఖాను యొక్క దౌర్జన్యములం జూచినకొలది భయ మధిక మగుచుండెను. ఖానుసాహేబునకు హేమలత యందనురాగము క్రమక్రమముగ నభివృద్ధి సెంద రాజకన్య మ్లేచ్ఛనాయకుని హృదయమునం దెల్లప్పుడు నుండసాగెను. బలాత్కారముగ నామెను బట్టి తెప్పించి తన యంతఃపురమున బంధించి సఫలమనోరథుఁ డగుట ఖానునకు సులభమే కాని యందున నేమికీడు మూడునో యనుభీతియు వారికాప్తుడైఁన మౌలవి కాగ్రహము వచ్చు ననుభయముమ వానిని బాధింపు చుండెను. మౌలవి సంపదలు లేక సామాన్య స్థితిలో నున్నను వాని విద్యాసంపదను బట్టియు, సత్ప్రవర్తనమును బట్టియు జనుల కాతని యెడ భయగౌరవములు