పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

హేమలత

యొక్క మనోహరాకారమును జూచుటాదిగ హేమలత కదివఱ కెన్నడును జనింపనిదియు నిట్టిదని నిరూపింపరానిదియు నగు నొకానొకమనోవికార ముదయించెను. దానితో బాలికకు రాచకొమరునియందు ననురాగము పుట్టెను. హృదయము గాఢముగ క్షత్రియపుత్రునియందు దవుల్కొని మరల్చుకొందమని యయ్యబల ప్రయత్నించిన మరలకయుండెను. అందుచే రాచకొమరు డచిరపరిచయు డయినను, గుణ సముద్రుడై కడు సుందరుడగు నీతని కింత బాల్యమునం దింతకష్ట మేలసంప్రాప్తింప జేసితివి దైవమా! ఈతడు నిరపాయుండయి బ్రదికి యెన్నడయిన బట్టగట్టునా” యని దైవము ననేక విధంబుల వేడుకొనుచు నిష్టదేవతా ప్రార్థన మొనర్చుచు నామె చింతించు చుండెను. అపుడు రమారమి యొక జాము ప్రొద్దుండుటచే కోడికూతవలన యోగి మేలుకొని మనుమరాలిని బిలిచి “అమ్మా! నీవు రాత్రి యంతయుమేలు కొన్నావు, ఇక నేను గని పెట్టు కొనియండెదను, నీవు నిద్రపొమ్ము” అని చెప్పి రోగిమంచము దగ్గఱకు బోయి యాతనినాడి జూచి జ్వరమతి తీవ్రముగానుండుటచే మఱియొక కొత్తమందువేసి మనుమరాలిని నిద్రపుచ్చి తా నొంటగ గూర్చుండెను.

అపుడు తనకు జరిగిన మహాపకారము జ్ఞప్తికిరా “ఆహాహా! అల్లాయుద్దీను చక్రవర్తి యొక్క క్రౌర్యము నన్నెంతవఱకుదెచ్చినది? భగవంతుడు దుర్మార్గులకు దోడ్పడుట కలియుగ ధర్మము కదా? హా జలాలుద్దీను చక్రవర్తి! ఎందున్నావు. అట్టి ధర్మశీలుడగు పినతండ్రిని జంపి సింహాసన మెక్కిన యల్లాయుద్దీనునకు నామీద దయ యెట్లుండును? ఇంతకు దైవానుగ్రహమేమో” యని యాత్మవిచార మొందునప్పటికి రోగి దాహ మడుగుటవలన యోగి తనతలంపుమాని దాహమిచ్చి శరీరముపై జేయివైచి జ్వరము తగ్గినదని