పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

19

విచార మొందుచుందురు. కెంజిగురాకులకు వన్నె దెచ్చు నామె ప్రశస్త హస్తములతో బావినీరు తోడునపు డామెవేళ్ళుకంది నొప్పులెత్తుటఁ జూచిన స్త్రీలందఱు నొక్కమారు కంటఁదడివెట్టుకొని యామె నేపనిని జేయనీయక తామె యామెకయి సకలకార్యములను జేయుచుందురు. ఈమె సంప్రాప్త యౌవనమైనది మొదలామె తాత యామెను వీధిలోని కరుగవలదనియు, దురాత్ముల దృష్టిని బడవలదనియుఁ బలుమాఱులు చెప్పుచుండుటఁబట్టి మునుపటివలె నిలువెడలక గృహముననే యుండుట కారంభించెను. అంధుఁ డయిన పితామహుని పరిచర్యయం దతి శ్రద్ధ గలిగి యతని కామె సమస్తోపచారములు విసుగక చేయుచుండును. అందుచేతనే నిద్రాభంగ మగునేని తాతకనారోగ్యమగునని యతని నిద్రపుచ్చి యామె రోగిమంచము నొద్దఁ గూర్చుండెను. అప్పుడు రెండు జాములరాత్రియైనది, మదనసింగును గాఢనిద్రాసక్తుఁడై నడుమ “ఓరి దురాత్ములార రండిరండి మీ ప్రాణము లపహరింపక మాననుసుఁడీ!” యని రెండుసారులు పలవరించెను. ఒక పర్యాయములేచి దాహముత్రాగి యొత్తిగిలి పండుకొన్నప్పుడు మనుష్యావతారము ధరించిన సౌందర్య దేవతవలె గట్టెదుట నిలిచి తనకు దాహమొసంగిన కాంతారత్నమును గన్నెత్తి చూచి మఱల నిద్రపోయెను. హేమలత యాతని ముఖావలోకనము జేయుచు సుందరమందహాస మతని ముఖారవిందమున నంకురించునపుడు తాను జిఱునవ్వు నవ్వుచు, వాని శరీరమున జెమ్మటపట్టునెడ దనశరీరమున జెమట పట్టువఱకును విసనకఱ్ఱతో విసరుచు గాయమువలన రాచకొమరుడు బాధపడునెడ దానెంతయు విచారపడుచు నతడు జ్వరపీడితుడగువేళ, తాతనులేపి యౌషధ మొసగుచు నతనితో సమస్త బాధల దాను బడుచు సకలోపచారముల జేయుచుండెను, మదనసింగు