పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

21

యెఱింగి సంతోషించి రాచకుమారుడు జీవించునని నిశ్చయించుకొనెను. తరువాత గొంతసేపటికి కాకులుకూయ నుదయపర్వతశిఖర మలంకరించుచు సకల జనమిత్రుం డగుసూర్యుడుదయించి తన యరుణకాంతి దిగంతముల యందు బర్వ బంగరుపూతవలె నలరు లేత నీరెండ సమస్త పదార్థములపై వ్యాపింప జేసి వాని కపూర్వాలంకార మొసంగెను. తన యాప్తమిత్రుని యవస్థ యెటులున్నదో యెఱుగగోరి సూర్యోదయ పూర్వముననేలేచి రహిమానుఖాను ప్రముఖులనులేపి తనవెంట బెట్టుకొని వచ్చిన నాజరుజంగు తనమిత్రస్థితి యపాయమును దాటినదని సంతోషించెను కాని రహిమానుఖాను రోగి యోగక్షేమము లరయక యవల ప్రక్కగదిలో దలుపుచాటున నిలువబడి యున్న హేమలత యొక్క యరుణపదపల్లవముల జూచి యాశ్చర్యపడి యా ప్రక్కనే తనచిత్తమును నిలిపి, నాజరజంగు మదనసింగులు తనలో జెప్పుచున్న మాటల కసంబద్ధప్రత్యుత్తరంబుల నిచ్చుచు “నేను విన్నదానికిని నేడు చూచినదానికిని సరిపోయినది. నందుడు సమయమునకు లేకపోయెను గద. అయిననేమి?” యని మనశ్శాంతి కలుగమి వారితో “నాకీ దినమున దల దిమ్ముగానున్నది. మీరనుకొను మాటలు నాకు వినబడుచుండుటలేదు.” అని చెప్పెను. మదనసింగును నాజర జంగును ఖానుసాహేబు యొక్క ముఖలక్షణములు మాఱుటయు నతం డసంబద్ధ సంభాషణుండగుటయు గ్రహించి కారణమూహింపజాలక యూరకుండిరి. తరువాత నందరును గోటకు జనిరి.