పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

హేమలత

గడియ లోపికఁ గలిగియుండుము. గ్రామ సమీపమునకు వచ్చినారము. ఆచెట్ల చాటున నున్నదే పాలి గ్రామము అని హెచ్చరించి కొంచెము మంచితీర్థ మత నికిఁ ద్రావనిప్పించె. నీరుత్రాగి సేదదీఱి రసపుత్రుఁడు ధైర్యమును బూని గుఱ్ఱముపైఁ గూర్చుండఁగా మరల నాజరుజం గిట్లనియె. “ఈ గ్రామమున మాబంధువుఁడును జక్రవర్తికిఁ బరమాప్తుఁడనైన రహిమానుఖానున్న వాఁడు. మనకు, సమస్తోపచారములు నతఁడుచేయును.” ఈమాటల తరువాత నిశ్శబ్దముగా వారందఱు నడచునప్పటికి గ్రామమువారియెదుట ననతిదూరమునఁ గనఁబడెను ఈ యాశ్వికులు గ్రామసమీపమున కరుగుట, ఖాను యొక్క సేవకులు కోట బురుజులమీద నుండి దూరముననే చూచి రహిమాను ఖానున కెఱిగింప నతఁడును సముచితవస్త్రములు ధరించి వారినెదుర్కొని సగౌరవముగ నాదరించి మదనసింగుయొక్క దురవస్థనుజూచి గాయమును మాన్పు మంగలి వానికైవర్తమానమును పంపెనుగాని యతఁ డూరలేనందన గొంచెము విచారించి ఖాను నాజరు జంగుతో నిట్లనియె. “తమ్ముడా! మంగలి వాఁడు లేడని మనము విచారింప నక్కఱలేదు. ఆవల మఠమున నొక వృద్ధుఁడగు బావాజీకలడు. ఈతని నటఁకు దీసికొని పొండు” అని చెప్పి తన సేవకులలో నొకనిని మఠమునకు జూపుమని పంపెను. మదనసింగును మెల్లమెల్లగా మఠమునకు దీసికొనిపోవువఱకు రాత్రి నాలుగుగడియల కాలమైనది. బావాజీయును సాయంకాలానుష్ఠానములను దీర్చుకొని భోజనముచేసి పండుకొనుటకు సిద్ధముగనుండెను. ఖానుచే సంపబడిన పరివారము ద్వార ముననుండ భానుయొక్క సేవకుండు బావాజీ మహారాజ్ అని కేకలు వేసి తలపుదట్టెను. బావాజీ యాతని కంఠదధ్వని నానవాలు పట్టి తనకడ కతఁ డెవరివో గాయపడిన వారిని దోడుకొనవచ్చెదనని యెఱిఁగి తన ప్రక్కను