పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

17

బవ్వళించిన మనమరాలిని మెల్లగా జేతితోఁదట్టి “హేమలతా! హేమలత! తలుపుదీయు మమ్మ” యని పిలిచెను. సాధుశీలము నవనీతహృదయయు నగు హేమలత తన పితామహుఁడు పిలిచినంతటనే లేచి తన్నతఁడు పిలిచిన కారణ మరసి నిద్రాభారముచే గనులు నులిమికొనుచు నతిదీర్ఘమగు వేణి భరమువీడి పిక్కలపైఁబడ మెల్లమెల్లగ దలుపుదీసెను. అపుడు రాజసేవకులవలన వేయబడిన కాగడాల వెలుతురున హేమలత ముఖము సంపూర్ణ శరత్కాలచంద్ర మండలమువలె ముద్దులమూట గట్టుచుండుటచే నొక నిమిషము వఱకును వారందఱు నిశ్చేష్టులై మదనసింగు యొక్క యవస్థను మఱచి యనిమిషత్వము నొంది యామెను జూచుచుండిరి.

వారి యాశ్చర్యమొక కొంత తగ్గువఱ కామె తాత దగ్గఱకుబోయెను. అంతట సేవకులు వృద్ధునితో దమరాకకుగారణ మెఱింగిఁచి స్మృతియెఱుంగక యున్న రాజపుత్రుని జూపిరి. వృద్ధుఁడును వానికి బ్రక్క గదిలో నొక మంచము వేయించి పూర్ణాంధుఁడు గనుక గాయమును దనహస్తముతో దడవి “యిది దిట్టమైన గాయమే అయినను రామదేవునిదయచే నాకిది సాధ్య మగు నని తోచుచున్నది. మీరందరు నావలకు బొండు, ఒకరుమాత్ర మిచట నుండుడని చెప్పి వారినందఱ నవల కంపకముందే యంధుడయ్యు నేత్రము లున్న వానికంటె నేర్పుగ గాయమునుగట్టి దానిపై నొకపట్టిక వైచెను. అంతవార్ధకమున నతనికి గల యోపికకును నపారప్రజ్ఞకును నందరు నాశ్చర్యపడి కన్వులున్నపు డెంతనేర్పరియై యుండునో” యని యోజింప నారంభించిరి. తరవాత వారిపరివారమున నొక్కని దక్క దక్కిన వారలనందఱ నావలకంపి వృద్ధుఁడు మనుమరాలిం జూచి “అమ్మాయి, ప్రొద్దుపోయినది పండుకొను” మని చెప్పెను. కాని యెందుచేతనో హేమ