పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

హేమలత

వస్త్రములకు దూరులై యాతనిమరణ మెదురుచూచుచు సాధ్యమగునేని తామె యాతని దుదముట్టింప దలచుచుండిరి. ఈత డన్యమతస్థులగు హిందువులకె కాక సదాచార పరాయణు లగు మహమ్మదీయులకు ననిష్టుడుగ నుండెను.

క్రీ. శǁ 1301 వ సంǁ రమున వేసవికాలమున నొకనాఁటి మధ్యాహ్నము పదుగురు మనష్యులశ్వారోహణ మొనర్చి పాలిగ్రామ సమీపమునకు వచ్చుచుండిరి. అందు ధవళతురంగమునెక్కి, మన్మధునివలె లావణ్యనిధియైన యెక రాజపుత్రకుమారుఁడు సేనానాయకుఁడై తోడివారలను దన మృదుమధుర వాక్యములచే హెచ్చరించుచు నెండతాపమున నుస్సురనుచు వచ్చుచుండెను. మదనసింగు రమారమి యిరువదియైదు సంవత్సరముల వయస్సుగలిగి మూర్తీభవించన పూర్ణయౌవనమువలె సర్వాంగసౌష్టవము తోడను, విశాలవక్షస్థలముతోడను జూచువారెల్లరు మెచ్చునట్లుండెను. ఆతని ధవళాశ్వముమీఁదఁ బారసీక దేశపుజీను వేయఁబడియుండెను. చలువ చేసిన తెల్లనిషరాయిదొడిగికొని విశాలమై జరీపట్టెలతోఁ దలతలమని సూర్య కాంతిచే మెఱయుతలపాగను ధరించి, నిగనిగకాంతులను గ్రక్కుచున్న నల్ల మొహము లంగరక దొరిగి, నడుమునుబటకాతో బిగించి, పైనున్న కాశ్మీర శాలువా నెండకడ్డముగ మీఁదవైచుకొని గుఱ్ఱమును మాటిమాటికీ జబుకుతో బెదరించుచుఁ బ్రయాణము సేయుచుండెను. క్షత్రియకుల శిరోభూషణుండును సగు భీమసింగునకు మదనసింగు బాలుఁడయ్యు నాంతరంగికుడగుటచే స్వామికార్యనిర్వాహణమునకై యప్పుడాగ్రానగరమున గారణాంతరమున వసించుచున్న చక్రవర్తి యొద్దకుఁ బోయి తన ప్రభువు పంపినసందేశమును దృప్తికరముగి నిర్వర్తించి తిరిగి చిత్తూరున కతఁడు వోవుచుండెను. జిల్లాయుద్దీ నతనితోఁగూడ నాజరు జంగను నతని నిచ్చి పాలిగ్రామమువఱకు