పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

ఆ గ్రామమునకు రమారమి పదునైదుక్రోశముల దూరమున “పాలి” యను చిన్న గ్రామము కలదు. తత్పరిసరమున నున్న మండలమునకు దానిని ముఖ్యపట్టణముగ నొనర్చి యందొక ప్రతినిధినేర్పఁరచి యాతనికి సర్వస్వతంత్ర్యాధికారమిచ్చి చక్రవర్తియగు అల్లాయుద్దీను పరిపాలన మొనర్చుచుండెను. పాలిసర్కారున కీ సమయంబున రహిమానుఖాన్ ఖిల్లాదారుగనుండెను. ఆతఁడు మొదట పారసీక దేశమునుండివచ్చిన బానిసఁవాడయ్యు దనస్త్రోత్ర పాఠనైపుణ్యముననో దురాచారసంపత్తి చేతనో యల్లాయుద్దీన్ చక్రవర్తి కాప్త వర్గములోని వాఁడై నానాఁటికి నున్నతపదవుల నొందుచుఁ దుదకు నీయధికారము నొందెను. ఈతఁ డీనూతనపదవినొంది యిప్పటికి మూఁడు సంవత్సరములైనది. అధికార ప్రాప్తియైనదిమొద లాతఁడు గర్వోన్మత్తుఁడై రాజకీయోద్యోగస్థుల నందఱ నగౌరవంబుతో జూచుచు నిజాధికారమునకు లోఁబడిన ప్రజల ననేకకష్టముల పాలు చేసిన విరోధియై యుండుటయేగాక యంతఃపుర స్త్రీలను జెఱపట్టుటయు దురాచారులచే దొంగతనములఁ జేయుటయు లోనగు దుష్కార్యధౌరేయుఁడై యహోరాత్రములు మద్యపాన మత్తుఁడై స్త్రీ జన మధ్యంబునఁ గాలము బుచ్చుచుండెను. అది చిన్న గ్రామమగుటచే నచ్చట నున్న యుద్యోగస్థులలోనెల్ల ఖానుగాలే మహోన్నత పదవినున్న కారణమున జన సామాన్య మాతని నవాబని చెప్పుకొనుచు నతని కటాక్షపాత్రు లగుటకు యత్నించు చుందురు. వెయ్యేల! చండతరమయిన ఖాను యొక్క పరిపాలనచే బ్రజలు మలమలమాడుచు నన్న