పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

133

జూచి స్వామి ప్రాణరక్షణ మవశ్యము కర్తవ్యమని మహమ్మదీయులెల్ల వడి వడిఁ బ్రతాపసింగు నాపుటకు వ్యాఘ్రములవలె రోషావేశ పరవశులై చని ప్రతాపసింగు దాఁకిరి. ప్రతాపసింగు మధ్యాహ్న సూర్యునివలె దుర్నిరీక్ష్య ప్రతాపుడై మహమ్మదీయ భటులకు భీతిగొలుపుచుండెను. మహమ్మదీయులు రసపుత్రులమీదికి వచ్చుటయుఁ జచ్చుటయు నేకకాలమున సంభవించెను. ఎందఱు తురకలను రసపుత్రులు చంపినను దురకలసేన యధికమగుటచే మరల యధా ప్రకారముగ సైనికులు ముందుకుఁ జనుచుండిరి. తుదకు జీమలపుట్టవలె మోటతురకలు చుట్టుముట్టుటచే స్వల్పసంఖ్యగల రాజపుతులు క్రమ క్రమమున క్షీణించిరి.

ఏమి చిత్రమోకాని రాజపుత్ర సైనికులలో నొక్కడైనను రణరంగమును విడిచి పరుగెత్తడయ్యె. కంఠమునఁ బ్రాణమున్నంతవఱకును రసపుత్రులు ఖడ్గమును విడువక యుద్దము జేసిరిగాని శత్రువుని చేతికిఁ గత్తి నీయరైరి. ఇట్లు సైన్యము పలుచబడినందునఁ బ్రకాతసింగు ఖడ్గమును డాలునుబూని యకాల మృత్యుదేవతవలెఁ దురకల పైబడి యనేకులను దెగనరక నాతని ధాటికి వెఱచి ముందటివారు చెల్లాచెదరై పరుగులిడిరి. తపవాత నలువది యోధులతో రణరంగమున నిలిచియున్న ప్రతాపసింగుపై వెనుక నున్న తురకలు గవిసిరి. ప్రజాపసింగు దేహమంతయు గాయములతో నిండి చిమ్మన గొట్టములనుండి వచ్చు వసంతమట్లు గాయములనుండి రక్తము స్రవించి చుట్టు పక్కల నున్నవారిపై బడుచుండెను. రక్త క్షయముచే, బలక్షయమగుటయు సింగు నడుమ నడుము సొమ్మసిల్లుచు దెబ్బ దెబ్బకు నొక్కొక్క తురకను గూల్చుచుండెను.