పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

హేమలత

ఆవేళ బ్రతాపసింగుచే నిహతులైనవారు దాదాపుగ నూరుమంది యుండిరి. బలహీనుడైయున్న ప్రతాపసింగుమీదికి రహిమానుఖాను వడివడి వచ్చి తాఁక సింగు గుఱ్ఱముమీదనున్న ఖానును దిగలాగి తన ఖడ్గమాతనిపై నెత్తెను. అప్పుడు మ్లేచ్ఛ సేనాధిపతియగు రహిమానుఖాను ప్రతాపసింగు పాదముల పైఁబడి “నేను నీ బిడ్డవంటి వాడను, నన్ను జంపినను మీ యింటి కుక్కను జంపఁజూచినను నొకటే బాబూ! నాకుఁ బ్రాణ దానము సేయుము. నాతల్లికి నేనొక్కడనే కుమారుడను. నాకు బిడ్డలు పుట్టిన మీ పేరు పెట్టెదను. నన్ను వదలి పెట్టు మహాప్రభూ! నన్ను వదలిపెట్టినయెడల మా చక్రవర్తియున్న రహస్య స్థలమును మీకుఁ జూపెదను. అతనిని మీరు చంపి మీ కసిదీర్చుకొనవచ్చునుగాని నావంటి దిక్కుమాలినవానిని జంపిన నేమి ప్రయోజనము” అని వీరపురుష లక్షణముల విడిచి పరిపరి భంగుల వేడికొన జాలి గుండెగల ప్రతాపసింగు వానిని విడిచిపుచ్చెను.

రహిమాను గండమునుండి బయలుపడి మఱి యితర యోధుఁడు కనబడకుండ గొంత సేపు చచ్చినయేనుఁగు చాటున దాగికొని యక్కడనుండి లేచి రాజపుత్రు లెక్కివచ్చిన పల్లకులలో నొకదానియందు రహస్యముగ దలఁదాచికొనెను. అదివఱకు జెఱలో నుండిన మదనసింగు మహమ్మదీయుల కలకలముజూచి చక్రవర్తి తన్ను విడిపింపడని యెఱిఁగి యాతనిచే మోసపోక ముందే మేలుకొని తన గుడారమునుండి వెడలివచ్చి రసపుత్ర వీరులను గలసికొనెను. భీమసింగు వానిని గనుఁగొని కొంత సైన్య మాతనికిచ్చి ప్రతాపసింగునకు సహాయ మొనర్పుమని యంప నాతడును సత్వరముగఁ