పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

129

బ్రార్థించుచుండెను. ఆ సాయంకాలమున సూర్యాస్తమయమైన తరువాత చిత్తూరుకోటలో నుండి యొక్క వరుసగ దురుష్క శిబిరమునకు నేడు వందల పల్లకులు రాసాగెను. పల్లకికి నల్వురు బోయలుండిరి. కోట మొదలు శత్రువుల స్కంధావారముదా కనేక పంక్తిగ నున్న పల్లకులను మోయు బోయల యోంకారనాదమువలన మహమ్మదీయుల కర్ణపుటములు పగలు చుండెను. శిబిరమున నొక చోట నాలుగు ప్రక్కలను దెరలగట్టించి చక్రవర్తి స్త్రీల పల్లకులను నా స్థలమునకు దీసికొనిపొండని బోయల కాజ్ఞాపించెను. లోపల కరిగిన మనుష్యులు తురకల కగపడకుండ దమఘోష నిలపుకొనిరి. శత్రు సైనికులు పల్లకుల వంక జూచుచు నశ్రద్ధతో నిరాయుధులై యుండిరి. ఆ పల్లకులలో బంగపు బనిచేసిన పల్లకీయందు పద్మిని కూర్చుండెనని చక్రవర్తితో బోయలు చెప్పిరి.