పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము

పల్లకులెల్ల నియమిత ప్రదేశమున కరిగిన తరువాత వానితో గూడ వచ్చిన దుర్గసింగు చక్రవర్తి యొద్దకు జని యిట్లనియె.

“అయ్యా! పద్మినీదేవి యింక మీ పట్టపుదేవి యగును. కాఁబట్టి శాశ్వత వియోగము సంభవించుచుండుటచే దనభర్తతో నొకమాఱు మాడలాడఁ గోరుచున్నది. అందుచే నొకగడియ సెలవు దయచేయింప వలెను” అని పలుకుటయుఁ జక్రవర్తి సరేయని సెలవొసఁగెను. పిమ్మట పద్మిని పల్లకి భీమసింగు గుడారమునకుఁ గొనిపోఁబడ వారిరువురు నొక గడియవఱకును మాట్లాడుచుండిరి. కామాతురుడైన యల్లాయుద్దీను నిమిష మైనను వియోగమున కోర్వలేక పద్మినితో సత్వరముగా సంభాషింపఁదలచి భీమసింగును విడువక ఢిల్లీ నగరమునకు బందీగాఁ గొనిపోవదలచియు రహిమానుఖానును బిలిచి యా దంపతులను బట్టికొమ్మని యానతిచ్చెను. రహిమాను ఖాను నిజ సైన్యముతో నచటి కరుగునప్పటికి రాజపుత్ర స్త్రీలుండు మందిరమునుండి యొక పల్లకి వారి కెదురుగ వచ్చెను. పల్లకివెంట నాయుధ పాణులగు రసపుత్రు లనేకులుండి యందున్న వారిని రక్షించుచుండిరి.

ఎదురుగవచ్చి వారి ప్రయాణమును నివారించుటకు మ్లేచ్ఛ భటులు ప్రయత్నించిరి. కానీ రసపుత్రులు నిలువనందున వారల కిరువురకును సంకుల యుద్ధము జరుగసాగెను. అంతలో భీమసింగు పాఱిపోవుచున్నాడని మహాధ్వని యొకటి శిబిరమున వ్యాపింప రహినూనుఖాను మోసమేదో సంభవించినదని తెలిసికొని ప్రాణభయనుగునని యెంచి వడివడిఁ జక్రవర్తి