పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

హేమలత

పద్మిని రాకను జక్రవర్తి ముఖమున విని యిదియె హేమలత నపాయము నుండి రక్షించుట కదనని యెంచి చక్రవర్తితో నిట్లనియె. “మహాప్రభూ! హేమలతను దీసికొని వత్తునా, వద్దా? ఆమె మీయొద్ద నుండిన యెడల మీకొక నష్టము సంభవించును. హేమలతయు బద్మినియు సవతులై యుండుటకు మహారాజపత్నియగు పద్మిని యొల్లదు. ఆమె యిందు కాగ్రహము దెచ్చుకొని మరలిపోవు నేమోయని నాకు భయమగుచున్నది. అని చంద్రసేనుడన జక్రవర్తి హేమలత తన కావశ్యము లేదని వాక్రుచ్చెను. వ్యాఘ్రముఖమునుండి బయలువెడలిన కురంగమట్లు చంద్రసేనుడు సంతోషించుచు బ్రభువు నొద్ద సెలవు గైకొనిపోయి యవార్త హేమలతకును దన భార్యకును దెలిపి వారితో గూడ నానంద మొందుచుండెను. సాయంకాల మగుటతోడనే చక్రవర్తి మధురాహారములు భుజించి యభ్యంగన మొనర్చి పద్మినిరాకను నిరీక్షించుచుండెను. వచ్చెడి స్త్రీ జనంబుల కెల్ల నొకపెద్ద గుడారము వేయబడి యుండుటచే వారు ఘోషాతో లోపలి కరుగుటకు వీలేర్పడెను! ఈ మహాట్టహాసమును విని పద్మిని సాహసమునకును రాజపుత్రుల యవినీతికిని రాజస్థానముయొక్క దురవస్థకును మదనసింగు భీమసింగ్ అద్భుత పడుచుండిరి. పతివ్రతయగు పద్మిని మ్లేచ్ఛరాజ సంభోగమువ కియ్యకొనుట గారణ ముండకపోదని చంద్ర సేనాదులును, నాజరు జంగ్ ను నాలోచించిరి. నాజరుజంగ్ పై జక్రవర్తికి రహిమాన్ ఖాన్ చెప్పెడు మాటలవలన గోపము నానాటి కధికమగుటచే గనబడినచోట మాటలాడుటయును నతడు మానెను. నాజరుజంగ్ మహా విచారముతో దన రాజభక్తి జూపు సమయ మెపుడువచ్చు నాయని దేవుని