పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

హేమలత

తెలిపి యతనిలోపము నతని కెఱింగించినను నతడు మనమాట కియ్యకొనడేని తగుచర్య జరుపుదము” అని గోరాసింగు నుడువ నంద ఱదియుక్తముని మదనసింగును సందేశాలర్థమరుగుమనిరి. మదనసింగు స్వామికార్యార్థ మెంతటి సాహసకార్యమునైన నాచరింప నుద్యుక్తుడగుటచే నీ కార్యమునకు సమ్మతించెను. ఆతడు మరల నింటికి రాక సువర్ణబాయికడ సెలవుగైకొనక కొలువుననున్న పినతండ్రికి నమస్కరించి యతనిచే నాశీర్వచనముల బడసి రాణావద్ద సెలవుగైకొని చక్రవర్తి సమ్ముఖమునకు గతిపయసేవకులతో బోయెను.

ఇట జిదానందయోగి యరుణోదయమునలేచి స్నానసంధ్యాదికముల దీర్చికొని సదాశివునిచే రప్పింపబడిన మంగలివానినొకచోట గూర్చుండుమని గాడిద నొకచెట్టునకు గట్టించి రాధను దనకడకు బిలిపించి యాగ్రహముతో “ఓసీ మూర్ఖురాలా! నీసంగతి నేనెఱుగుదును. నీవు పాలిగ్రామములో నుండు రాధవు. చిత్తూరు నీవెట్లువచ్చితివి?” అని యడిగెను. అది భయ సంభ్రమములచే నొడ లెఱుంగక కొంతసేపుండి తెలిసి యింక బొంకిన కార్యము లేదని యిట్లనెను. “స్వామీ! మదనసింగు పాలిగ్రామమునకు వచ్చినపు డాయనమీద నాకు వెఱ్ఱిమోహ ముదయిలప నాపుకొనలేక హేమలత ఖాను పాలయినదని యెంచి నేనామెవేషము వైచికొనివచ్చి నాకర్మ వశమున బట్టుపడితిని. నాకు బ్రాణదానము చేయవలెను. నేను మీబిడ్డను” అని యోగిపాదములపై బడి హృదయము కరగునట్టు రోదనమారంభించెను. యోగి జాలిగొని ప్రాణదానము జేయుటకు వాగ్దానముజేసి దానిని దొడ్డిలోనికి దీసికొనిపోయి తానొక చేయియు సదాశివుడొక చేయియు బట్టికొని యౌవన పరిపూర్ణురాలగు నామెను వికృతాంగిగ నొనర్పదలచి క్షారముజేయుమని