పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

119

మంగలివాని కాజ్ఞయొసగ వాడు తుమ్మెద ఱెక్కలవలె నల్లనివై నిడుదలగు రాధశిరోజముల భారము బాపి విధవవలె జేసెను. వికృతాంగియగునామెను యోగి తక్షణమే గాడిదపై గూర్చుండ నియమించి చిత్తూరనగరమున వీథుల వెంట ద్రిప్పించెను. గ్రామనివాసులెల్ల మందలు మందలుగ నామెను జూడ వచ్చి కడుపులు పగులునట్లు నవ్వసాగిరి. ఇట్లు సంభవించిన పరాభవము భరింపలేక రాధ యాపూట నగరము విడచి గ్రామాంతరము బోయెను. అక్కడ మదనసింగు చక్రవర్తి శిబిరమునకు జని తన రాక నతని కెఱిగించెను. అక్కడ మదనసింగు వంటి శూరశిఖామణిని శత్రు మండలమున లేకుండ జేయుటకు జిరకాలమునుండి ప్రయత్నించుచున్న చక్రవర్తి యాతని రాకవిని రహిమానుఖానునకు వర్తమానము నంపెను. రహిమాను ఖానును మదనసింగు పైగల యసూయచే నాతని రాయబారము విననక్కఱ లేదనియు వెంటనే యాతని జెఱబెట్ట దగుననియు జక్రవర్తికి నాలోచనచెప్పెను. చక్రవర్తి తత్ప్రకారముగ మదనసింగును గారాగృహమున బెట్టించి రహిమాను ఖానును నచట గావలియుండ నాజ్ఞాపించెను. మదనసింగు ననుచరులలో నొకడు సత్వరముగ బఱతెంచి యతని యవస్థను బ్రతాపసింగునకు విన్నవించెను. భీమసింగు చెఱలో బడిననాడెట్లు చిత్తూరున దుఃఖముదయించెనో యటులే నేడును మదనసింగు విషయమై దుఃఖముదయించెను. ప్రతాపసింగు విచారమునకు నలవిలేదు. సువర్ణ భాయి కీసంగతి తెలిసినపుడు గాలి తాకున నేలపైబడు తీగవలె నామె మూర్ఛతో, తెలిసిన తరువాత సన్నపానములు ముట్టక దుఃఖపారవశ్యము నొందియుండెను. ఆ దివసముట్లు మహమ్మదీయ శిబిరమున మహానందముతోడను రాజపుత్ర శిబిరమున దుఃఖముతోడను గడచినవెనుక మఱునాడుదయమున చక్రవర్తి మదన