పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదియారవ ప్రకరణము

ఆ మఱునా డుదయమున నిద్రమేలుకొనక ముందే సేవకులరుదెంచి మహారాణావారు రమ్మని వర్తమానమంపిరని చెప్ప మదనసింగు వస్త్రాలంకారముల దాల్చి తనయశ్వము పైనెక్కి మఠమునందున్న తన ప్రియురాలి యోగక్షేమము నరసికొనుటకు యోగికడకు వచ్చెను. యోగి మదనసింగును రహస్యముగ నొకగదిలోనికి గొనిపోయి యాతనితో “బాబా! యీ పడుచు హేమలతకాదు. పాలిగ్రామమున నుండెడి రాధయను దాసి సుమీ. దీని విషయమై దయ దలపక నేను దగినట్లు శిక్షించెదను. నీదారిని నీవరిగి పని జూచుకొనుము” అని చెప్పెను. ఆ పలుకులు విని మదనసింగత్యంతాశ్చ ర్యమునొంది తన్నట్లు మోసపుచ్చిన రాధ శిక్షార్హురాలని యొప్పుకొనెను. కాని స్త్రీయగుటచే క్షమించి ప్రాణహాని లేకుండ జేయుమని యోగిని ప్రార్థించి తాను గోట కరిగెను. అప్పటికి ప్రతాపసింగు గోరాసింగును మొదలగు ప్రధాన యోధులువచ్చి దర్బారున గూర్చుండిరి. మదనసింగు దనకుచితమగు నాసనమున గూర్చుండి భీమసింగును మ్లేచ్ఛుల బారినుండి తప్పించుటకు దగునుపాయ మాలోచించు చుండెను.

అప్పుడు గోరాసింగు లక్ష్మణసింగును సభ్యులను జూచి యిట్లనియె. “మన మీ సమయమున చక్రవర్తియొద్దకు మదనసింగును రాయబారిగ నంపుదము. అంతటి న్యాయముతో ప్రవర్తించిన మాయెడ మీరింత యన్యాయముతో ప్రవర్తించుట సత్పురుషోచితము కాదని చక్రవర్తికి నతడు