పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

109

వాకిట గూర్చున్న కృష్ణసింగు నడిగెను. మదనసిం గంతకుముందె రెండు గడియలక్రిందట నింటికి వచ్చియుండుటచేఁ గృష్ణసింగామాటవిని తలయూచి లోపలికరిగి తన యజమానుని వెంటబెట్టుకొని వచ్చెను. బండివైపు వచ్చుచున్న మదనసింగును జూచి ముసలిది యెదురుగా బోయి అయ్యా! మీ దర్శనము నిమిత్తము మీ ప్రియురాలగు హేమలత వచ్చినది. అదిగో అని మేలిముసుగు మరుగుననుండి సిగ్గుచే బండిచాటుననున్న యాసుందరిని జూపెను. ఆ మాటలువిని మదనసింగునకు బంచప్రాణములును లేచి రా సంతోషమును నివారించుకొని లోపలికి రండని యిరువురను బిలిచెను. అంతట నాబాలికను మాత్రము మదనసింగు వెంటబెట్టుకొని తనగదిలోనికి దీసికొనిపోయి కూర్చుండ నియమించి, యెట్లు పాలిగ్రామము నుండి యామె వచ్చెనో యా వృత్తాంతము నెరుగ జేయుమని యడుగ అయ్యా! నేను మిగుల శ్రమజెంది మీ నిమిత్తము వచ్చినాను. మాతాత గారు మృతినొందినారు. నేను దిక్కులేక యున్నాను. నాసంరక్షణ భారము మీదేయని యిటు వచ్చితిని అని చెప్పి కంటనీరు పెట్టుకొనసాగెను. మదనసింగామె యెడ దయార్ద్రుడయు “సుందరీ! నీకు భయములేదు. మాపినతండ్రితోడను బినతల్లితొడను జెప్పి నిన్నెట్లయిన నేను దప్పక వివాహమాడెదను. నీవు మాయింట నుండుము” అని చెప్పునప్పటికి బ్రతాపసింగు సంభ్రమముతో దెల్ల బోయి చూడసాగెను. ప్రతాపసింగు క్రొత్త విగ్రహముల జూచి “నాయనా! వీరెవరు” అనియడిగెను. మదనసింగు లజ్జావనతముఖుడై యూరకుండ ముసలిది అయ్యా! మీకుమారుని హృదయము