పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

హేమలత

జక్రవర్తి సమర్పించిన పక్షమున నాతఁడు చిత్తూరు ముట్టడి మాని స్వదేశమున కరుగుటకు సమ్మతించునని చక్రవర్తి రహిమాన్ ఖాన్ చే సందేశము నంపుటచే నభిమానధనులగు రాజపుత్రులు తమ కోపాగ్ని ప్రజ్వరిల్లి శాత్రవారణ్యమును దహింప గృతప్రతిజ్ఞులైరి. రాయబారిని వధించు పాపమని భీమసింగు చెప్పి వారింపకున్న నాదినమున ఖాను శిరస్సు వేయివ్రక్కలై యుండును. రాజపుత్రులెల్ల రోషమున జేవురించి మొగములతో భయంకరాకారులై పగదీర్చుకొనవలెనన్న యుత్సాహంతో సింహనాదముల జేసిరి. రహిమాన్ ఖాను శత్రుమండల మధ్యమున గజ గజ వడకుచు బ్రాణముల నఱచేతఁ బట్టికొని యుండెను. తరువాత వారు ఖానునంపి కవచశిరస్త్రాణములు ధరించి యుద్ధసన్నద్ధులైరి. ఈ వార్త నల్లాయుద్దీను విని మరల ముట్టడి నారంభించెను. ఉభయ సైనికులు నొండొరులపై దారుణాగ్ని వర్షముల గురియించుచుండిరి. చిత్తూరు ప్రవేశించిన కొన్ని దినములకు హేమలత చంద్రసేనునితో దనకు మదనసింగుపై గల యనురాగమును దెలిపి నాజరుజంగునకుఁ దనరాక నెఱిగింపుమని ప్రార్థించెను. అతడు హేమలత శిబిరమున నుండుట నాజరుజంగున కెరిగింప వారిరువురు నెట్లయిన నామెను మదనసింగు నొద్ద కంపుటకుపాయముల వెదకుచుండిరి. అట్టి యుద్ధ సమయమున నామె నవలి కంపుట తమకు హానికరమని యెంచి వారప్పటి కూరకుండిరి.

ఆ రాయబారము జరిగిన నాలుగు దినములకు ముట్టడి యతి తీవ్రముగనుండఁగ సాయంకాలమునందుఁ బ్రతాపసింగు గృహము నొద్దకొక బండి వచ్చి నిలచెను. ఆ బండిలో నొక ముదుసలియు బదియారేండ్ల ప్రాయముగల యొక కన్నియయుఁ గూర్చుండిరి. బండి వారిగుమ్మమువద్ద నిల్చినతోడనే ముసలిది బండిదిగి మదనసింగు గారున్నారా? యని