పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

107

గొని భీమసింగు రసపుత్రుల నెల్ల సిద్ధముచేసి కోట సంరక్షణమున కాజ్ఞనొసఁగెను. అలాయుద్దీన్ చక్రవర్తియుఁ గోటముట్టడి నారంభించి తన కాప్తుఁడు రాజకీయ వ్యవహారముల యందాలోచన చెప్పువాఁడునగు రహిమాన్ ఖాన్ నకు సేనాధిపత్యము నొసగెను. రహిమాన్ ఖాన్ కత్తి బట్టనేఱని పిరికివాండ్రలోఁ జేర్పబడదిగినవాఁడయ్యు, గౌరవార్థ మీమహోద్యోగము నంగీకరించెను. కోటగోడ యిరువది రెండడుగుల యెత్తుగలిగి యైదడుగుల వెడల్పుగలిగి యుండెను. కోటచుట్టు నగాధమైన కందక ముండెను. ఆ కందకము మీదనుండి లాగివేయబడు టకు వీలుగానున్న యొక వంతెన యుండెను. ముట్టడి యారంభమైనతోడనే మహమ్మదీయుల ఫిరంగులను బారుచేసి బారుచేసి కోటగోడను నిర్మూలింప బ్రయత్నించిరి. కాని యది దుర్లభమయ్యెను. పలుమారు పటాలముల వెనుక పటాలములు వచ్చి యగడ్త మట్టితోఁ బూడ్చి కోటగోడలపై గవిసెను గాని రసపుత్రుల బాణాసారమున హతములయ్యెను. తరువాత మ్లేచ్ఛులు లగ్గలకెగసి కోటఁ బట్ట సాహసించిరి గాని పై నుండి రాజపుత్రులు నిప్పులును మసలినచమురును, శిలలును వారిపై వైచుటచేఁ జచ్చిరి. మహమ్మదీయు లెన్ని భంగుల బ్రయత్నించినను గోటస్వాధీనము గాకుండుటజూచి చక్రవర్తి స్వసైన్యనాశనమునకు విచారింప దొడఁగెను. ముట్టడి ఫలము లేక యనేకమాసము లుండుటఁజేసి యుభయసైన్యములు విసిగి యెట్లయిన ముట్టడి నివారణమైన బాగుండునని తలఁచుచుండెను. అలాయుద్దీన్ సంధిజేసి కొనుటకు సిద్ధముగ నుండెను. గాని రసపుత్రులు ముందుగ సంధికి రారైరి. ముందుగ సంధియగుట దన కవమానకరమని చక్రవర్తి వెనుదీయుచుండెను. భీమసింగు మహారాజు భార్య యగు శ్రీ పద్మినిని