పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

హేమలత

నాకర్షించిన హేమలత యీమెయే యని యుత్తరమిచ్చెను. ప్రతాపసింగున కట్టి వివాహ మనిష్టమైననూ కుమారునికాగ్రహము కలుగునని వారిని లోనికి దీసికొనిరా నాజ్ఞాపించెను. అంతలో ముసలిదియు నావలి కరిగినందున నబ్బాలిక మోహాతిశయముచే శరీరము నెరుగక మదనసింగు సమీపమునకుఁ బోయి నేను నీదాననే నీవునన్ను వివాహమాడునట్లు నాకు వాగ్దానము చేయుము అని మదనసింగును గాఢాలింగనము జేసికొని వదలకుండెను. భయముతో మదనసింగా కౌగిలింతను వదలించుకొని సుందరీ! నీవురాచకన్నియవు. పెండ్లి గాక ముందు నన్ను గౌగలించుకొనుట తప్పు సుమీ! యని విచారించి యుత్తమక్షత్రియ కన్యయగు హేమలత కన్యాజన స్వభావమగు లజ్జను బరిత్యజించి యట్ల జేయుట కాశ్చర్యపడుచు గదివెలుపలకి వచ్చెను. అంతలో భర్తచే నంపబడిన సువర్ణపాయి తత్ప్రదేశమున కరిగి కుమారుని జూచి నవ్వుచు దనకు గోడలు కాదలచిన బాలికను సగౌరవముగ గృహమునకు వెంటబెట్టగొనిపోయెను. ముసలిదియు దనకు బంధువులున్నారని చెప్పి వెడలిపోయెను.