పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

హేమలత

యొక్కయు సైనికుల యొక్కయు నంతఃపుర స్త్రీజనంబులును నరుగుచుండిరి. ఇందే చంద్రసేనుని కుటుంబమును వచ్చుచుండుట జేసి మన హేమలతయు నొకపల్లకియందుఁ గూర్చుండి ప్రయాణము సేయుచుండెను. చంద్రసేనుని భార్య హేమలతను దన సోదరివలెఁ గాపాడుచుండెను. సైనికుల కోలాహలధ్వనులును హాయహేషలును గజబృంహితములును, బల్లకుల యోంకారనాదములును, బ్రహ్మాండమును బ్రద్దలు సేయసాగెను. ఈ సైన్యము చిత్తూరునకుఁ బదియేనుక్రోసుల దూరములకు వచ్చినప్పుడు చక్రవర్తి సైన్యము నిశ్శబ్దముగా నడువవలయుననియు శత్రువులు తమరాకను గుర్తించరాదనియు రణదుందుభులు మ్రోయింపవలదనియు నానతి నిచ్చెను.

నిరంతర ప్రమత్తుడై తిరుగు చిదానందయోగిచే నంపబడిన వేగులవాండ్రు సైన్యమువచ్చు టెరిఁగి యోగికి విన్నవింపనతఁడా వార్త రాజుకు దర్బారునందు దెలియజేయుట మనమీవరకే చదివినాము. ఆరాత్రి చక్రవర్తి సైన్యము యొక్క రాకను దానిస్థితిని దెలిసికొమ్మని భీమసింగును గోరాసింగును బంప వారు చూచి వచ్చి యావార్త రాణాకును భీమసింగునకు విన్నవించిరి. అంతట రాజపుత్రులు చిత్తూరు సంరక్షణమునకు సమస్త ప్రయత్నములఁ జేయసాగిరి. రాజపుత్ర సైన్యములకును శూరాగ్రేసరులగు గోరాసింగును బ్రతాపసింగును సేనాధిపతులుగ నియమింపబడిరి. మదనసింగు శ్రీభీమసింగుగారికిని శ్రీరాణాకును నంగరక్షకుఁడుగ నియమింపబడెను. మూర్తిమంతమగు ప్రతాపమువలె బ్రతాపసింగు సైన్యముల నెల్ల జక్కజేయ నారంభించెను.

ఆ మహమ్మదీయ సైన్యమట్లు ప్రయాణముచేసి మెల్లమెల్లగ జిత్తూరు నగరమునకు వచ్చికోట యెదుట విడిసెను. సైన్యమును గనుఁ