పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాలుగవ ప్రకరణము

చక్రవర్తి మహాసేనా సన్నాహమును జేసికొని రాజస్థానముపై దండువిడియుటకు వెడలెను. ఆ మహాసైన్యమందు హిందువులు, పిండారీలు, జాటులు, బౌద్ధులు, జైనులు మొదలగు స్వదేశీయులును; అరబ్బులు, పారసీకులు, తురుష్కులు, నాపుగనులు, అల్బీనియనులు, తార్తారీలు, మొగలాయీలు మొదలగు ననేక మహమ్మదీయులును జేరియుండుటచేత నాశిబిరము కదలి వచ్చుచున్న మహానగరమువలె నుండెను. క్రమశిక్షణయుఁ దగుపరీక్షయు లేనందున సైనికులెందరో యెవ్వరు నెఱుంగరు. ముందరన దుందుభులు దిగంతములు ప్రతిధ్వనులెసఁగ మ్రోయ దళతళ మెఱయు ఖడ్గములను హస్తములఁ దాల్చి యమ్ముల పొదుల మూఁపులనిడి జయైక దీక్షతోఁ గాల్బలములు మొదట నడుచుచుండెను. అవ్వెనుక పారసీక తురంగముల నెక్కి చేతులతో బల్లెములబట్టి నొక్కుమ్మడి నాశ్వికులు వెడలుచుండిరి. వారివెనుక మదగజేంద్రములపై బంగరు కంబళములతోడను వెండికప్పుల తోడ గ్రాలు నంబారీలు నెక్కిఁపచ్చపట్టు బరుపులపై గూర్చుండి సేవకులు వింజామర లిడ సకల సేనాసముద్ర నియామకుడై శ్రీఢిల్లీశ్వరుండగు నలాయుద్దీన్ చక్రవర్తి వచ్చుచుండెను. చక్రవర్తికిరుకెలంకులను దృణీకృతమృత్యుదేవతలగు మహమ్మదీయ సామంతులంగరక్షకులై నడచుచుండిరి. వారి వెనుక శిబిరానుచరులును వారి వెనుక నేనుఁగులనెక్కియుఁ బల్లకులలోఁ గూర్చుండియు శ్రీచక్రవర్తి యొక్కయు హిందూమ్లేచ్ఛ ప్రభువుల