పుట:Hello Doctor Final Book.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాధులను (Cerebro vascular insuffciencies), హృదయకవాట వ్యాధులను, కనుగొనగలరు. ఈ వ్యాధులు కలవారిలో హృద్ధమని వ్యాధులు కలిగే అవకాశములు ఎక్కువ. పరీక్షలు :

హృద్ధమని వ్యాధికి కారణములు లేనపుడు గుండెనొప్పి (angina) లక్షణములు లేనివారిలో, వ్యాయామపు ఒత్తిడి పరీక్షలు (exercise stress testing) ఊఱకే చేయుట వైద్యులు ప్రోత్సహించరు. అట్టి పరీక్షల వలన వ్యాధికి తప్పుడు అనుకూల ఫలితములు (false positive results) తఱచు రావడము  దీనికి కారణము.

హృద్ధమని వ్యాధి లక్షణములు కలవారిలో హృదయ విద్యుల్లేఖనము (electrocardiogram) చేయాలి. ఛాతిలో నొప్పి, ఆయాసము కలిగించు ఇతర వ్యాధులను కనిపెట్టుటకు ఛాతికి ఎక్స్- రే చిత్రములు తియ్యాలి. రక్తకణపరీక్షలతో పాండురోగము (anemia; వీరిలో రక్తకణముల ప్రాణవాయువు వహనము తగ్గుతుంది), బహుళ రక్తకణ వ్యాధిని (polycythemia vera; వీరిలో ఎఱ్ఱరక్తకణముల సంఖ్య ఎక్కువయి రక్తసాంద్రత, జిగట పెరుగుతుంది. వీరిలో చిన్న ధమనులలోను, రక్తకేశనాళికలలోను రక్తప్రసరణ మందము అవుతుంది.) కనుగొనవచ్చును. గళగ్రంథి స్రావక (thyroxine) పరీక్షలతో గళగ్రంథి ఆధిక్యతను (hyperthyroidism) తెలుసుకొన వచ్చును. రక్తరసాయనక పరీక్షలతో మధుమేహవ్యాధిని, మూత్రాంగముల వ్యాపారమును తెలుసుకొనవచ్చును. ప్రతిధ్వని హృదయచిత్రీకరణము ( echocardiography) :

హృదయవైఫల్యము (Congestive heart failure), హృదయకవాట వ్యాధులు (valvular heart diseases), గుండెపోటులు కలిగిన వారిలో తగిన సమాచారమును సమకూర్చగలదు. ఎడమ జఠరిక రక్తప్రసరణ శాతము (leftventricularejectionfraction),హృదయ వ్యాపారములు  ప్రతిధ్వని హృదయ చిత్రీకరణము వలన తెలుస్తాయి.

87 ::