పుట:Hello Doctor Final Book.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసరణను పెంచవలసిన భారము హృదయముపై పడుతుంది. అపుడు హృదయవేగము పెరుగుతుంది. హృదయమునకు ప్రాణవాయువు, పోషక పదార్థ ము ల అవసరములు పెరుగుతాయి. అందుచే హృదయమునకు రక్తప్రసరణ అవసరాలు పెరుగుతాయి, కాని హృద్ధమనులలో అవరోధములు ఉండుట వలన ఆ అవసరాలు తీరవు. ఆ కారణమున హృద్ధమని వ్యాధి లక్షణములు ప్రస్ఫుట మవుతాయి. ముకుళిత రక్తపీడనము (systolic blood pressure) పెరిగినపుడు కూడా హృదయమునకు శ్రమ పెరుగుతుంది. హృదయ కండరమునకు (myocardium) రక్తప్రసరణ హృదయము వికసించినపుడు (diastole) హెచ్చుగా సమకూడుకుంది. హృదయ వేగము పెరిగినపుడు హృదయవికాస సమయము తగ్గి హృదయమునకు రక్తప్రసరణ తగ్గుతుంది. హృదయమునకు రక్తప్రసరణ చాలనపుడు ఛాతిలో రొమ్ము ఎముకకు (ఉరోస్థి; sternum) వెనుక నొప్పి గాని, అసౌఖ్యత గాని కలుగుతుంది. కొందఱిలో ఛాతిలో బిగుతు, ఛాతిపై భారము, ఛాతిని పిండునట్లు భావము, లేక ఛాతిలో తిమ్మిరి కలుగుతాయి. ఈ బాధ ఎడమ భుజమునకు, దవడకు ప్రాకవచ్చును. కొందఱిలో గుండెనొప్పిగా కాక రక్తప్రసరణ లోపము ఆయాసము, నీరసము, ఒళ్ళు తూలుట, అనిశ్చలత, మస్తిష్కములో మార్పులుగా కనిపించవచ్చును. ఈ లక్షణములు నియమిత శ్రమవలన కలిగి, నియమిత విరామము తర్వాత గాని, నాలుక క్రింద  నైట్రోగ్లిసరిన్ తీసుకొనుట వలన గాని తొలగుతాయి.

హృద్ధమనులలోని మృదుకండరముల దుస్సంకోచము (spasm) వలన, బృహద్ధమని కవాటముల సంకుచితము (aortic stenosis) వలన, ముకుళిత రక్తపీడనము (systolic blood pressure) బాగా పెరిగినపుడు, హృదయకండర అతివృద్ధి వ్యాధి  (hypertrophic cardiomyopathy) కలవారిలోను, ధమనీ కాఠిన్యత లేకపోయినా గుండెనొప్పి, గుండెనొప్పి లక్షణములు కలుగవచ్చును.

వైద్యులు రోగులను పరీక్షించునపుడు  అధిక రక్తపుపోటును, దూరధమని వ్యాధులను (Peripheral Arterial Diseases), మస్తిష్కధమనుల

86 ::