పుట:Hello Doctor Final Book.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాళపరిమాణము తగ్గి రక్తప్రవాహమునకు అవరోధము కలుగవచ్చు. రక్తము గడ్డ క ట్టుటకు తోడ్పడే తాంతవజని (Fibrinogen), రక్త ఫ లకములు (Platelets) కూడా పొగత్రాగేవారిలో విరివిగా ఉత్పత్తి చెందుతాయి.

హృదయ ధమనులలో(Coronary arteries) కాఠిన్యత పెరిగి రక్తము గడ్డకడితే హృదయకండరములకు రక్తప్రసరణ లోపించి గుండెపోటులు రావచ్చును. అదే విధముగా మెదడు రక్తప్రసరణకు అవరోధము కలుగుతే మస్తిష్క (రక్తనాళ) విఘాతములు (Cerebrovascular accidents) కలిగి పక్షవాతములు సంభవిస్తాయి.

దూరధమనులలో రక్తప్రసరణ లోపాలు (Peripheral arterial diseases) కలుగవచ్చును. రక్తప్రసరణ లోపాలవలన కాళ్ళు కోల్పోయిన వారు తఱచు ధూమపానీయులే! పొగత్రాగేవారిలో వారు పీల్చే కార్బను మోనాక్సైడు (Carbon monoxide) ఎఱ్ఱకణాల హీమోగ్లోబిన్ తో (Hemoglobin) జతకూడుట వలన అవి పంపిణీ చేసే ప్రాణవాయువు (Oxygen) తగ్గుతుంది. ధమనీకాఠిన్యత వలన పురుషులలో నపుంసకత్వము (impotency) కూడా కలుగుతుంది. మూత్రాంగముల వ్యాపారము కూడా పొగత్రాగేవారిలో క్షీణిస్తుంది. వివిధ అవయవాల వ్యాపారము దెబ్బతినుటవలన అంతర్గతముగాను, బాహ్యముగాను పొగ త్రాగేవారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరితగతిలో ప్రస్ఫుటము అవుతాయి. పిన్నవయస్సులోనే ముఖచర్మములో ముడుతలు పొడచూపుతాయి.

ఈ వ్యాసములో పేర్కొన్న విషయాలను వైద్యవృత్తిలో ఉండుటవలన ప్రత్యక్షముగా ప్రతిదినము చూస్తాను. ధూమపానము వీడుటవలన చాలా రోగములు నివారించగలుగుతాము. ఎనభై, తొంబై సంవత్సరాలకు వచ్చే రోగములు, మరణములు నలభై, ఏభై సంవత్సరాలలో కలుగకుండా నివారించుట ఎంతో మేలు కదా! అందువలన  పొగత్రాగేవారు మొండివాదనలు, సాకులు, నెపాలు

79 ::