పుట:Hello Doctor Final Book.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోవడము వలన వాటికి కర్కటవ్రణములు అని (cancers) పేరు కలిగింది. ఈ వ్రణముల కణములు ఆ యా అవయవ కణజాలములుగా పరిణతి చెంద కుండా విభజనలతో పెరుగుదలలుగా వృద్ధి పొందుతాయి. కొన్ని కణములు రక్తనాళములలోనికి, రసనాళికలలోనికి (lymphatic channels) ప్రవేశించి రక్తప్రసరణ ద్వారా వివిధ అవయవములకు, రసనాళికల ద్వారా రసగ్రంథులకు (lymph nodes) వ్యాప్తిచెంది అచ్చట కొత్త వ్రణములను (metastasis ; అవయవాంతర వ్యాప్తి) సృష్టిస్తాయి. ఇవి పోషకపదార్థాలను సంగ్రహిస్తాయి. ఈ వ్రణములు అవయవాల దైనందిక వ్యాపారములకు అంతరాయము కలిగిస్తాయి. పోషకపదార్థాలు అవయవాలకు తగినంతగా చేరకపోవుటవలన, ఆకలి తగ్గుటవలన, అరుచి కలుగుటవలన రోగులు చిక్కిపోతుంటారు. తగిన చికిత్స జరుగకపోయినా, చికిత్సకు అనుకూలించకపోయినా ఇవి మరణమునకు దారితీయవచ్చును. పొగాకు పొగలో ఉండే బెంజోపైరీన్ (Benzopyrene) వంటి పోలిసైక్లిక్ ఏరొమేటిక్ హైడ్రోకార్బనులు కణములలో డీ ఎన్ ఏ  కు (D.N.A) అంటుకొని మార్పులు (mutations) తెచ్చి వాటిని కర్కటవ్రణ కణములుగా మారుస్తాయి. పొగాకు పొగలో పెక్కు కర్కటవ్రణజనకములు (Carcinogens) ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

పొగత్రాగనివారి కంటె పొగత్రాగేవారిలో ఊపిరితిత్తుల పుట్టకురుపులు యిరవైరెట్లు అధికముగా కలుగుతాయి. పొగత్రాగేవారిలో ఊపిరితిత్తుల్లోనే కాక, మూత్రాంగములలోను (Kidneys), స్వరపేటికలలోను (Larynx), మూత్రాశయములలోను (Urinary bladder), అన్నవాహికలలోను (Esophagus), జీర్ణాశయములలోను (Gastric cancers), క్లోమములలోను (Pancreas) పుట్టకురుపులు కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇతర అవయవాలలో కర్కటవ్రణములు పుట్టుటకు కూడా ధూమపానము సహకరిస్తుందని పరిశోధనలు నిరూపించాయి. ఊపిరితిత్తులలో వచ్చే కాన్సరులు ప్రస్ఫుట మయ్యేసరికి తొంబయి శాతముమందిలో శస్త్రచికిత్స స్థాయిని దాటిపోతాయి. అందుచే చికిత్స  ఫలప్రదమయ్యే అవకాశము చాలామందిలో తక్కువ. పొగ త్రాగకుండా వాటిని నిరోధించుట చాలా మేలు.

77 ::