పుట:Hello Doctor Final Book.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొగత్రాగేవారు సగటున పది సంవత్సరాల ఆయువును కోల్పోతున్నట్లు గమనించాను.  అదే విషయము వైజ్ఞానికపత్రికలలో ప్రచురించబడుట చూసాను. ధూమపానము ఊపిరితిత్తుల పుట్టకురుపులకు (Cancers) కారణమని తెలిసినా, అంతకంటే ఎక్కువగా ధూమపానము చేసేవారు నడివయస్సులోనే గుండెపోటులకు (Heart attacks), మస్తిష్క విఘాతములకు (Cerebrovascular accidents) గురికావడము, మరణించడము కూడా గమనించాను. శ్వాసకోశవ్యాధులు (Pulmonary diseases) కూడా విపరీతముగా పొగత్రాగేవారిలోనే చూస్తాము. దీర్ఘకాల శ్వాసఅవరోధక వ్యాధులు (Chronic obstructive pulmonary diseases) ఊపిరితిత్తుల వ్యాకోచవ్యాధులు (Emphysema) కలిగి పొగత్రాగేవారు దగ్గు, ఆయాసాలతో బాధపడి చాలా జీవితకాలము కోల్పోవుట వైద్యులము నిత్యం చూస్తాము. పొగత్రాగే వారిలో కనీసము ఏభై శాతమునకు తగ్గకుండా అనారోగ్య దుష్ఫలితాలకు గుఱి అవుతారు. ధమనీ కాఠిన్యము (Atherosclerosis) కలిగి రక్త ప్రసరణ లోపాలతో వివిధ అవయవాలు దెబ్బతినడమువలన, పెక్కు కర్కటవ్రణములు (cancers)  కలిగించే రసాయనములు (Carcinogens) వలన ఊపిరితిత్తులు, మరియు యితర అవయవాలలో కర్కటవ్రణములు (Cancers) పుట్టడము వలన ఆయుః క్షీణము, నడివయస్సు మరణాలు సంభవిస్తాయి. అందువలన, నా రోగులకే కాక, మిత్రులకు, బంధువులకు, పొగ త్రాగుట వలదని సలహా ఇస్తాను. పాఠకులలోను, మిత్రులలోను పొగ త్రాగేవారుంటే ఒక నిర్ణీత ప్రణాళిక ప్రకారము త్వరగా ఆ అలవాటును మాన్చుకోవలసిందిగా వినతి చేస్తున్నాను. ఆ అలవాటును దరి చేరనీయరాదని పిల్లలకు, పాపలకు చెప్పుకోవాలి. పొగాకు వినియోగము, ధూమపానాల వలన కలిగే వ్యాధులను ఇక్కడ ఒక జాబితాగా పొందు పరుస్తాను. కర్కటవ్రణములు ( Cancers ) :

పుట్టకురుపులుగా ప్రచారములో ఉన్న యీ క్రొత్త పెరుగుదలలు జన్యువులలో మార్పులు (Mutations) కలిగి, కణములు శిథిలము చెందక త్వరితముగా పెరిగి విభజనలు పొందుట వలన పుడతాయి. ఈ పెరుగుదలలు అవయవముల లోనికి మూలములతో ఎండ్రకాయల కాళ్ళ వలె చొచ్చుకు

76 ::