పుట:Hello Doctor Final Book.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. ధూమపానము

ఇంటికి సెగనుం బెట్టరు,
కంటికి పొగ పెట్టిరేని కారును జలముల్;
పెంటా? యూపిరితిత్తులు?
మంటల తెగ పాలుసేయ మానక పొగలన్!

పొగాకు; ధూమపానము:

పొగాకు వ్యసనము:

పొగాకు అమెరికా ఖండములో చాలా శతాబ్దాల క్రితమే  పుట్టినా పదిహైనవ శతాబ్దములో స్పైనుకు చేరి  క్రమంగా యూరప్, ఆసియా, ప్రపంచమంతా వ్యాపించింది. చుట్టలు, సిగరెట్లు, బీడీలు, పైపులూ ద్వారా ధూమ రూపములోను, నస్యరూపములోను పీల్చబడి, గూట్కా రూపములోను, నములుడు పొగాకుగాను మ్రింగబడి వినియోగించబడుతుంది.

పొగాకు వినియోగము ఆరంభములో నాగరికత చిహ్నముగా పరిగణించబడినా పందొమ్మిదవ శతాబ్దములో దానివలన కలిగే దుష్ఫలితాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ దుష్ఫలితాల తీవ్రత కారణంగా పొగాకు వినియోగమును ఒక వ్యాధిగా పరిగణించవలసిన పరిస్థితి ఏర్పడింది.

ధూమపానమువలన కలిగే దుష్ఫలితాలను నేను వైద్యవిద్యార్థిగా నేర్చుకొన్నా, వైద్యమును అభ్యసిస్తున్న కొద్ది సంవత్సరములలోనే ప్రత్యక్షముగా చూడడము వలన పొగాకు కలిగించే ప్రమాదాలు ప్రస్ఫుటముగా తెలిసాయి.

75 ::