పుట:Hello Doctor Final Book.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. గళగ్రంథి విచ్ఛేదన (Thyroidectomy ) :

గళగ్రంథి కర్ణికలలో హెచ్చు భాగములను శస్త్రచికిత్సచే తొలగించి (Subtotal thyroidectomy) గళగ్రంథి ఆధిక్యతను అరికట్టవచ్చును. ఈ దినములలో శస్త్రచికిత్స అరుదుగా చేస్తారు. రేడియోధార్మిక అయొడిన్ చికిత్సకు ఇష్టపడనివారికి, థయోనమైడులతో గళగ్రంథి స్రావకఉధృతి అదుపుకాని వారికి, థయోనమైడుల వలన అవాంఛిత ఫలితములు కలిగినవారికి శస్త్రచికిత్స అవసరమవుతుంది. శస్త్రచికిత్సకు ముందు థయోనమైడులతో గళగ్రంథి స్రావక ఆధిక్యతను తగ్గించాలి. వీరికి శస్త్రచికిత్సకు ముందు రెండు వారములు అయొడిన్ చికిత్స అవసరము. బీటా గ్రాహక అవరోధకముల చికిత్స కూడా అవసరము. శస్త్రచికిత్స తదుపరి కొద్దివారములు యీ చికిత్సలు కొనసాగించాలి.

శస్త్రచికిత్సలో సహగళగ్రంథులు (Parathyroid glands) తొలగించ బడితే సహగళగ్రంథి హీనత (Hypoparathyroidism) కలిగే అవకాశము ఉన్నది. స్వరతంత్రి నాడులకు (nerves innervating vocal chords) హాని కలుగుతే స్వరతంత్రుల వాతము (Vocal chord paralysis) కలుగవచ్చును. అపుడు బొంగురు గొంతు, రెండు ప్రక్కల నాడులకు హాని కలుగతే శ్వాసకు ఇబ్బంది కలుగుతాయి. శస్త్రచికిత్స పిమ్మట గళగ్రంథిహీనత కలుగుతే కృత్రిమ గళగ్రంథి స్రావకములతో (Levothyroxine) చికిత్స అవసరము. బహుళ కిణ గళగండములు (Multinodular goiters) ఉన్నవారిలో గళగ్రంథి స్రావకముల విలువలు సాధారణ పరిమితులలో ఉన్నపుడు, ఏ యితర యిబ్బందులు లేనప్పుడు శస్త్రచికిత్సలు గాని, విపరీతముగా పరిశోధనలు గాని అనవసరము. ఒకే ఒక కిణము (Solitary nodule) పొడచూపినప్పుడు సూది, పిచికారులతో కణములను పీల్చి కర్కటవ్రణములకై కణపరీక్షలు సలుపవచ్చును. కణపరీక్షలు సక్రమముగా ఉంటే యితర చికిత్సలు అనవసరము.

74 ::