పుట:Hello Doctor Final Book.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయొడిన్ చికిత్స వలన కొందఱిలో గళగ్రంథిలో నిక్షిప్తమయిన స్రావకములు విడుదలయి తాత్కాలికముగా రెండు వారములు పాటు వాటి ఉద్రిక్తత హెచ్చుకావచ్చును. హృద్రోగములు ఉన్న వారికి ఆ ఉద్రిక్తతను తగ్గించుటకు తాత్కాలికముగా ధయోనమైడులతో చికిత్స అవసరమవవచ్చును. రేడియోధార్మిక అయొడిన్ చికిత్స వలన కర్కటవ్రణములు (Malignancy) కలుగవు. చికిత్స తదనంతరము గర్భము దాల్చిన స్త్రీల శిశువులకు చికిత్స వలన జన్మతః వ్యాధులు (Congenital diseases) సంక్రమించవు. 2. థయోనమైడులు (Thionamides ) :

థయోనమైడులు గళగ్రంథిలో థైరోగ్లాబ్యులిన్ తో అయొడిన్ సంధానమును నిరోధించి గళగ్రంథి స్రావకముల ఉత్పత్తిని ఆటంకపరుస్తాయి. ప్రొపైల్ థయోయురసిల్  థైరాక్సిన్ (Thyroxine, T4) ట్రైఅయిడో థైరొనిన్  గా (T-3) మారుటను కూడా నిరోధిస్తుంది. గర్భిణీ స్త్రీలలోను, గళగ్రంథి తాపములోను (Thyroiditis), అయొడిన్ వినియోగము ఎక్కువగుటలన, ఎమియోడరోన్ (amiodarone) వంటి మందులవలన తాత్కాలికముగా గళగ్రంథి ఆధిక్యత కలిగినప్పుడు, రేడయోధార్మిక అయొడిన్ వాడుకకు ఇష్టపడని వారిలోను, థయోనమైడులను ఉపయోగిస్తారు. కార్బిమజాల్ (Carbimazole), మిథైమజాల్ (Methimazole), ప్రొపైల్ థయోయురసిల్ (Propylthiouracil) థయోనమైడులకు ఉదహరణములు. వీటి ప్రభావము కనిపించుటకు కొద్ది వారములు పడుతుంది. ముందు హెచ్చు మోతాదులలో వాడినా తరువాత వీటి మోతాదును రక్తపరీక్షలబట్టి తగ్గించాలి.

దద్దురులు, చర్మతాపము (Dermatitis), కీళ్ళనొప్పులు, జ్వరము, కాలేయతాపము (Hepatitis), తెల్లకణముల ఉత్పత్తి తగ్గుట (agranulocytosis) వంటి అవాంఛిత ఫలితములను జాగ్రత్తగా గమనించాలి. పచ్చకామెరలు, గొంతునొప్పి, చలిజ్వరము కలుగుతే వెంటనే థయోనమైడులను ఆపివేసి రక్తపరీక్షలు చెయ్యాలి. ఈ మందుల వాడుక ఆపివేస్తే అవాంఛిత ఫలితములు సాధారణముగా ఉపశమిస్తాయి. అవాంఛిత ఫలితముల గురించి రోగులకు అవగాహన సమకూర్చాలి.

73 ::