పుట:Hello Doctor Final Book.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గళగ్రంథి లోపము కలుగజేయదు. వీరిలో ఆకలి కొంత మందగించవచ్చును. అయొడిన్ లోపించిన వారిలో గలగండము (Goitre) కనిపిస్తుంది.

గుండె పైపొరలో నీరుపట్టుట (Pericardial effusion), పుపుస వేష్టనములో నీరుచేరుట (Pleural effusion), మణికట్టు వాపు (Carpal tunnel syndrome) వినికిడి తగ్గుట, అఱుదుగా కనిపించవచ్చును. వ్యాధి తీవ్రమయిన వారిలో ఊపిరి మందగించవచ్చును.

గళగ్రంథిహీనత దీర్ఘకాలముగాను, తీవ్రముగాను  ఉన్నవారిలో మ్యూకోపాలీసాకరైడులు (Mucopolysaccharides) చర్మము దిగువ చేరుకొని పొంగులు, వాపులు కనిపించవచ్చును. ఈ పొంగులు ఉన్నచోట వేలుతో నొక్కితే గుంతలు పడవు. చర్మము దళసరిగా ఉండే వీరి వ్యాధిని మిక్సిడీమా (Myxedema) అంటారు.

వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో శరీరము చల్లబడి, గుండెవేగము బాగా తగ్గి, గందరగోళము, బుద్ధిమాంద్యత, అపస్మారకము (Myxedema coma), శ్వాసమాంద్యము (bradypnea) కలిగి ప్రాణాపాయస్థితి కూడా కలుగ వచ్చును. ఇది అసాధారణము. పుట్టిన పసికందులలో గళగ్రంథి హీనత ఉంటే అది క్రెటినిజం గా (Cretinism) వర్ణిస్తారు. వారికి కండరముల బిగుతు సన్నగిల్లుతుంది. పుఱ్ఱె వెనుక భాగము పూడుకొనక మెత్తదనము చాలా మాసములు ఉండవచ్చును., (సాధారణముగా యీ మెత్తదనము రెండు, మూడు మాసములలో పూడు కుంటుంది. ముందుభాగములో మెత్తదనము18మాసములలో పూడుకుంటుంది.) బొంగురు గొంతుకతో ఏడవడము, శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండుట, నాభి గోళకము (Umbilical hernia), దళసరి నాలుక యీ శిశువులలో కలుగుతాయి. వ్యాధిని నిర్ణయించి, గళగ్రంథి స్రావకములతో వైద్యము సమకూర్చకపోతే పెరుగుదల మందగించుటే కాక బుద్ధి వికాసము లోపించి వీరికి బుద్ధి మాంద్యత కలుగుతుంది. వ్యాధి నిర్ణయము :

గళగ్రంథి హీనత ఉన్నవారిలో వ్యాధి లక్షణాలు క్రమేణా పొడ

63 ::