పుట:Hello Doctor Final Book.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విధముగా గళగ్రంథి ప్రేరేపకపు విడుదల రక్త ప్రసరణములో ఉండే గళగ్రంథి స్రావకముల ప్రతివర్తమానము (Feed back) పై ఆధారపడి ఉంటుంది.

రక్తములో గళగ్రంథి ప్రేరేపకపు (TSH) విలువ హెచ్చుగా ఉంటే అది గళగ్రంథి హీనతను (Hypothyroidism) సూచిస్తుంది. గళగ్రంథి చైతన్యము హెచ్చయి (Hyperthyroidism) రక్తములో గళగ్రంథి స్రావకముల ప్రమాణాలు హెచ్చయితే గళగ్రంథి ప్రేరేపకపు (TSH) విలువలు తక్కువగా ఉంటాయి.

శరీరపు పెరుగుదల ఎక్కువగా ఉన్నపుడు శరీర అవసరాలకు తగినట్లు పీనసగ్రంథి నుంచి గళగ్రంథి ప్రేరేపకపు విడుదల అధికమవుతుంది. గళగ్రంథి స్రావకములు థైరాక్సిన్ (T4), ట్రైఅయిడో థైరొనిన్ లు (T3) రక్తములో థైరాక్సిన్ బైండింగ్ గ్లాబ్యులిన్ (TBG) అనే మాంసకృత్తుకి అంటుకొని రవాణా చేయబడుతాయి. కొంతభాగము మాత్రము స్వేచ్ఛగా ఉంటాయి. గళగ్రంథిలో నాలుగు అణువులు అయొడిన్ గల థైరాక్సిన్ (T4) నుంచి ఒక అణువు అయోడిన్ తొలగించబడి మూడు అయొడిన్ అణువుల ట్రైఅయుడో థైరొనిన్ (T3) కొంత విడుదల అయినా 80 శాతపు థైరాక్సిన్ గళగ్రంథి నుంచి విడుదల అవుతుంది. కాలేయములో (Liver) యీ థైరాక్సిన్ (T4) ట్రైఅయుడో థైరొనిన్ గా (T3) మార్పు జెందుతుంటుంది. కణజాలములో ట్రైఅయుడో థైరొనిన్ (T3) కే చైతన్యత ఉంటుంది.

కణజాలములో జరిగే జీవప్రక్రియలు (Metabolism) అన్నిటికీ గళగ్రంథి స్రావకములు అవసరము. విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము (Basal metabolic rate) శరీరములో ఉన్న గళగ్రంథి ప్రభావమును సూచిస్తుంది. కణజాలముల వృద్ధికి, పరిపక్వతకు, పెరుగుదలకు గళగ్రంథి స్రావకములు అవసరము. వివిధ మాంసకృత్తుల సంకలనమునకు, పిండిపదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తుల జీవప్రక్రియలకు, శరీరములో ఉష్ణజనితమునకు గళగ్రంథి స్రావకములు అవసరము.

60 ::