పుట:Hello Doctor Final Book.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హృద్ధమని వ్యాధి చరిత్ర ఉండి, పెక్కు ప్రమాద హేతువులు (risk factors) ఉంటే, అల్పసాంద్ర లైపోప్రోటీనుల (LDL) పరిమితి 70 మి .గ్రా / డె .లీ కంటె తక్కువకు తీసుకురావాలి.

రెండుకి మించి ప్రమాద హేతువులు ఉన్నవారిలో అల్పసాంద్ర లైపో ప్రోటీనులను 100 మి.గ్రా./డె.లీ కంటె తక్కువకు తీసుకురావాలి ప్రమాద హేతువులు లేని వారిలో అల్పసాంద్ర లైపోప్రోటీనుల పరిమితి 160 మి.గ్రా. / డె.లీ కంటె తక్కువకు దించాలి. ఈ పరిమితులకంటె ఎక్కువగా చెడు కొలెష్ట్రాలు (LDL) ఉంటే మందులు అవసరము. ఔషధములు : స్టా టినులు (Statins)

స్టాటినులుగా ప్రాచుర్యములో ఉన్న  3- హైడ్రాక్సీ, 3- మెథైల్ గ్లుటరిల్ కోఎంజైం-ఎ రిడక్టేజ్  అవరోధకములను (HMG-CoA reductase 3-hydroxy-3-methyl-glutaryl-coenzyme A reductase inhibitors) విరివిగా యిప్పుడు వైద్యులు వాడుతారు. ఇవి ప్రమాదకర హృద్రోగముల సంఖ్యలను బాగా తగ్గించడము వైద్యులు గమనించారు. పెక్కు సంవత్సరాలు వైద్యవృత్తిలో ఉన్న నేను యీ స్టాటినుల సత్ఫలితాలకు ప్రత్యక్ష సాక్షిని. నా వద్ద వైద్యము చేయించుకొనే రోగులలో సత్ఫలితాలను నిత్యము చూస్తున్నాను. ప్రావస్టాటిన్ (pravastatin), సింవాస్టాటిన్ (simvastatin), అటోర్వస్టాటిన్ (atorvastatin), రొసువాస్టాటిన్ (rosuvastatin), లోవాస్టాటిన్ (lovastatin), ఫ్లూవాష్టాటిన్ లు (fluvastatin) ఉదాహరణలు.

కండరాల నొప్పులు, కండరాల నీరసము, కీళ్ళనొప్పులు వంటి అవాంఛిత పరిణామాలు వీటివలన కలుగవచ్చును. కండరకణ విచ్ఛేదనము (Rhabdomyolysis) జరిగి క్రియటినిన్ కైనెజ్ (creatinine kinase) విలువలు పెరుగవచ్చును. ఈ పరిణామాలు కలుగుతే ఆ మందులను ఆపివేయాలి. వేఱొక స్టాటిన్ ని తక్కువ మోతాదుతో ప్రయత్నించవచ్చును.

55 ::