పుట:Hello Doctor Final Book.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధమనీ కాఠిన్యము కలిగించే యితర ప్రమాదహేతువులను అనుసరించి అల్పసాంద్ర లైపోప్రోటీనులు (LDL), టైగ్లిసరైడులు ఏ పరిమాణములలో ఉంటే ప్రమాదకరమో నిర్ణయించి వాటిని తగ్గించే ప్రక్రియలను, మందులను వాడుకోవాలి

గుండెపోటులకు గురియైన వారిలో 90 శాతము మందిలో అల్పసాంద్ర లైపోప్రోటీనులో (LDL), Lp(a) వో, ట్రైగ్లిసరైడులో ఎక్కువవడమో, లేక అధికసాంద్ర లైపోప్రోటీనులు (HDL) తక్కువవడమో కనిపిస్తుంది. ఈ క్రొవ్వు విపరీతములను (Dyslipidemias) పిన్నవయస్సులోనే రక్తనాళ వ్యాధులను కలుగజేస్తాయి. అందువలన రక్తపరీక్షలతో వీటిని కనిపెట్టి చికిత్సకు పూనుకొనాలి. ఇరువది సంవత్సరాల వయస్సు తరువాత తొలిసారి రక్తపరీక్షలు జరపాలని, ఎట్టి లోపాలు లేకపోతే ఆ తరువాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొవ్వుపదార్థాలకై పరగడపు రక్తపరీక్షలు చేయాలని హృదయ వైద్య నిపుణులు సూచనలు ఇస్తారు.

కొవ్వులు, కొలెష్ట్రాలు ఎక్కువయితే జీవనశైలిలో మార్పులు, ఔషధాలు అవసరము. జీవనశైలి మార్పులు :

ఆహారములో కొవ్వుపదార్థాలను తగ్గించుట, సంతృప్త వసామ్లములు (Saturated fatty acids) గల తైలములు తగ్గించి అసంతృప్త వసామ్లములు (Unsaturated fatty acids) గల తైలముల వాడుక పెంచుట, ఎక్కువ బరువుంటే బరువు తగ్గుట, తగినంతగా వ్యాయామము చేయుట, పొగత్రాగుట మానుట, మద్యము వినియోగము తగ్గించుట, రక్తపుపోటు, మధుమేహ వ్యాధులను అదుపులో పెట్టుట చాలా అవసరము. కుసుమనూనె (safflower oil), పొద్దుతిరుగుడు నూనె, ద్రాక్షవిత్తుల నూనె, ఆలివ్ నూనెలలో అసంతృప్త వసామ్లములు ఎక్కువగా ఉంటాయి. వాటి వాడుక మేలు. జంతు సంబంధపు కొవ్వులలో కొలెష్ట్రాలు, సంతృప్త వసామ్లములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి వాడుకను తగ్గించుకొనుట మంచిది.

54 ::