పుట:Hello Doctor Final Book.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్ననాళములో ఇరకటము ( Esophageal stricture ) :

వ్రణములు, ఒరిపిడులు పదే పదే కలిగి తంతీకరణముతో (fibrosis) మానుటవలన అన్ననాళములో ఇరకటములు (సంకోచములు /strictures) ఏర్పడుతాయి. ఈ ఇరకటములు సన్నబడినప్పుడు ఘనపదార్థములు మ్రింగుట ఇబ్బందికరము అవుతుంది. అంతర్దర్శినితో కనుగొని బుడగ సాధనములతో వీటిని వ్యాకోచింపజేయవచ్చును. వీరు ఆమ్లయంత్ర అవరోధక ఔషధములను (Proton pump inhibitors) నిరంతరముగా వాడుకోవాలి. బేరట్స్ అన్నవాహిక (Barrett’s Esophagus):

ఆమ్లతిరోగమన వ్యాధిగ్రస్థులలో అన్ననాళ శ్లేష్మపుపొరలో ఆంత్రకణజాల పరిణామములు (intestinal metaplasia) కలుగవచ్చును. వీరిలో లేత గులాబిరంగు బదులు ఆ భాగములు ముదురు ఎఱుపు గోధుమ వర్ణములలో ఉంటాయి. వీరిలో కర్కటవ్రణములు (cancers) కలిగే అవకాశములు పెరుగుతాయి. దీర్ఘకాలము ఆమ్లతిరోగమన వ్యాధి కలవారిలో 50 సంవత్సరములు పైదాటిన వారిని అంతర్దర్శినితో పరీక్షించి అసాధారణ భాగముల నుంచి తునుకలు గ్రహించి కణపరీక్షలు చెయ్యాలి. ప్రమాదకర కణపరిణామములు (dysplasia) ఉంటే ఆ ఆంత్రకణజాలపరిణామ (intestinal metaplasia) భాగములను వివిధ ప్రక్రియలలో ఒక దానిని ఎన్నుకొని (radio frequency ablation, laser ablation, or photo ablation) విధ్వంసము చెయ్యాలి. అన్ననాళములో ఆంత్రపరిణామములు (intestinal metaplasia) ఉన్నవారికి మూడు సంవత్సరములకు ఒకసారైనా అంతర్దర్శిని పరీక్షలు, కణపరీక్షలు (biopsies) చెయ్యాలి. అన్నవాహిక కర్కటవ్రణములకు శస్త్రచికిత్సలు అవసరము. బేరట్స్ అన్ననాళ లక్షణములు ఉన్నవారికి ఆమ్లయంత్ర నిరోధకములతో (proton pump inhibitors) చికిత్స నిరంతరముగా కొనసాగించాలి.

433 ::