పుట:Hello Doctor Final Book.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రాహక అవరోధకములు ఏబది శాతముమందిలో ఆమ్లతిరోగమన లక్షణాలను అరికడతాయి. వీటిని దినమునకు ఒకసారి గాని రెండు సారులు గాని భోజనములకు ముందు వాడుకోవాలి. ఆమ్ల (ప్రోటాను) యంత్ర అవరోధకములు (Proton pump inhibitors) :

ఇపుడు ప్రోటాను యంత్ర అవరోధకములు (proton pump inhibitors) విరివిగా ప్రాచుర్యములో ఉన్నాయి. ఇవి ఉదజని (ఆమ్ల) స్రావమును అణచివేస్తాయి.

ఒమిప్రజోల్ (Omeprazole), ఎసొమిప్రజోల్ (Esomeprazole), లాన్సప్రజోల్ (Lansoprazole), పాన్టొప్రజోల్ (Pantoprazole) ప్రోటాను యంత్ర అవరోధకములకు ఉదహరణములు. జఠర ఉదజ హరికామ్ల స్రావమును అరికట్టుటలో ఇవి మిక్కిలి సమర్థవంతమైనవి. దినమునకు ఒకసారి గాని, రెండు సారులు గాని తగిన మోతాదులలో వాడుకోవాలి. ముందు హెచ్చు మోతాదులలో వాడినా రెండు, మూడు మాసముల పిమ్మట అవసరమైన మోతాదులకు పరిమితము చేసుకోవాలి. దీర్ఘకాలము వీటిని వాడుకొనే వారిలో అస్థిసాంద్రత (bone mineral density) తగ్గుటకు, విటమిన్ బి -12 పరిమాణములు తగ్గుటకు, సూక్ష్మజీవులు వలన ఊపిరితిత్తుల తాపములు (pneumonias) కలుగుటకు అవకాశము కలదు. కాని వీటి వలన చేకూరే ప్రయోజనమే హాని కంటె అధికము. నియంత్రణ కండరపు బిగువు పెంచు ఔషధములు :

బెక్లొఫెన్ (Baclofen) అనే మందు అన్నవాహిక దిగువ నియంత్రణ కండరము వదులు కాకుండా చేసి ఆమ్లము వెనుకకు అన్ననాళములోనికి పోవుటను అరికడుతుంది. కాని దీనివలన అవాంఛిత ఫలితములు కలుగుతాయి కనుక ఎక్కువగా వాడరు.

మెటోక్లోప్రమైడ్ (Metoclopramide) అన్ననాళము, జఠరములలో కండర చలనమును ఉత్తేజపరచి ఆమ్లతిరోగమనమును అరికడుతుంది. దీనిని దీర్ఘకాలము వాడేవారిలో తల, చేతులలో వణకు వంటి అసాధారణ చలనములు కలుగగలవు. అందుచే దీనిని ఎక్కువగా వాడరు.

431 ::