పుట:Hello Doctor Final Book.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చికిత్స : జీవనశైలి మార్పులు :

శరీరపుబరువు ఎక్కువైనవారు ఆహారములో కేలరీలు తగ్గించుకొని, వ్యాయామము చేస్తూ బరువుతగ్గే ప్రయత్నాలు చెయ్యాలి. భోజనము తర్వాత రెండుగంటల వఱకు నడ్డి వాల్చకూడదు. పడుక్కొనేటప్పుడు తల పక్క ఎత్తుగా పెట్టుకోవాలి. నిదురించేటపుడు ఎడమవైపుకు తిరిగి ఉండుటకు యత్నించాలి. కాఫీ, టీ, చాకొలేట్, మద్యములను మితపరచుకోవాలి. ధూమపానము మానివేయాలి. ఈ సూచనలు అనుసరిస్తూ తగిన మందులు కూడా అవసరమయితే వాడుకోవాలి. ఆమ్లతిరోగమనము లక్షణములు తఱచు కలిగే వారికి ఔషధములు అవసరము. ఆమ్లహరములు ( antacids ):

మృదుక్షారములు అల్యూమినియమ్ హైడ్రాక్సైడ్, మెగ్నీషియమ్ హైడ్రాక్సైడు, మెగ్నీషియమ్ కార్బొనేట్ లను ఒక్కక్కటిగా గాని, మిశ్రమములుగా గాని జఠరామ్లమును తటస్థీకరించుటకు అవసరమయినపుడు లేక భోజనమునకు గంటన్నర, రెండుగంటల తర్వాత నిర్ణీతసమయాలలో గాని వాడవచ్చు. ఆమ్లతిరోగమనము తీవ్రము కానివారిలోను, అప్పుడప్పుడు కలిగేవారిలోను, తాత్కాలిక ఉపశమనమునకు మృదుక్షారములు ఉపయోగకరము. మూత్రాంగవైఫల్యము ఉన్నవారిలో మెగ్నీషియమ్ లవణముల వాడుకలో చాలా జాగ్రత్త అవసరము. వీరు అల్యూమినియమ్ హైడ్రాక్సైడు వాడుకొనుట మేలు. హిస్టమిన్ - 2 గ్రాహక అవరోధకములు ( Histamine -2 receptor blockers) :

ఇవి జఠరకణములపై హిస్టమిన్ ప్రభావమును అరికట్టి ఉదజ హరికామ్ల స్రావమును అణచివేస్తాయి. సైమెటిడిన్ ( Cimetidine), రెనెటిడిన్ ( Ranitidine ) ఫెమొటిడిన్ ( Famotidine ), నైజటిడిన్ ( Nizatidine ) హిస్టమిన్ -2 అవరోధకములకు ఉదహరణలు. హిష్టమిన్

430 ::