పుట:Hello Doctor Final Book.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరీక్షలు :

గుండెమంట, ఆమ్లపదార్థములు తఱచు నోటిలోనికి వచ్చేవారికి ఆమ్లయంత్ర నిరోధక ఔషధములు (proton pump inhibitors) రెండు నెలలు వాడి వారి వ్యాధి లక్షణములు నివారించబడితే వారికి వేఱే పరీక్షల అవసరము లేదు.

అప్రయత్నముగా బరువుతగ్గుట, పాండురోగము (anemia), ఆహారము మ్రింగుట కష్టమగుట, మ్రింగునపుడు నొప్పి కలుగుట, రక్తస్రావము వంటి ఆందోళనకర లక్షణములు కలవారిని ఇతర వ్యాధులకై అంతర్దర్శినితో (endoscopy) అన్ననాళ, జఠర, ఆంత్రములను శోధించి (Esophago Gastro Duodenoscopy) చిన్న శకలములను గ్రహించి కణ పరీక్షలకు పంపాలి. అన్ననాళములో అప్రమాదకరమైన సంకోచములు ఉంటే బుడగ సాధనములతో వైద్యులు సంకోచములను వ్యాకోచింపజేయగలరు. వీరిలో రక్తగణ పరీక్షలు, రక్తద్రవ రసాయన పరీక్షలు కూడా అవసరమే. మధుశిలీంధ్ర అన్ననాళతాపము (Candidial esophagitis), విషజీవాంశ తాపములు, సంకోచములు (strictures), కండరచలన దోషములు, జీర్ణవ్రణములు (peptic ulcers), కర్కటవ్రణములు (cancers) వంటి ప్రమాదకర వ్యాధులను ఆలస్యము కాకుండా కనుగొనుటకు అంతర్దర్శన పరీక్షలు ఉపయోగపడుతాయి. పి హెచ్ పర్యవేక్షణ :

శలాక సాధనముతో అన్ననాళములోని పి.హెచ్ ను (ఆమ్ల, క్షార పరిమాణము తెలుపు సూచిక) నిరంతరము ఒకదినము పర్యవేక్షించి అన్ననాళములో ఆమ్లతిరోగమనములను, వాటి తీవ్రతను నిర్ధారించవచ్చును. ఆమ్లనిరోధకములు వాడినా వ్యాధిలక్షణాలు తగ్గనివారిలో ఈ పరీక్ష ప్రయోజనకారి. అన్ననాళ  పీడన పర్యవేక్షణ (esophageal manometry) కండరచలన దోషములు కనుగొనుటకు ఉపయోగపడుతుంది.

429 ::