పుట:Hello Doctor Final Book.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42. ఆమ్ల తిరోగమనము (జఠర - అన్ననాళ ఆమ్ల తిరోగమనము) (Gastro Esophageal Reflux Disease) కడుపులో నుంచి ఆమ్లపదార్థములు వెనుకకు అన్ననాళము లోనికి  మఱలి రావడము, అందువలన ఛాతిలో మంట కలుగడము  తఱచు వైద్యులు చూస్తారు. సుమారు 20 శాతము మంది వయోజనులు ఈ ఆమ్ల తిరోగమనమునకు (Acid reflux) గుఱి అవుతారు. ఆమ్ల తిరోగమనము వలన కొన్ని ఉపద్రవములు కూడా కలుగవచ్చు.

అన్న నాళము (అన్న వాహిక / oesophagus) ఆహార పానీయాలను గొంతునుంచి కడుపునకు చేర్చే ఒక ఒక కండరనాళము. ఇది కంఠము మధ్య భాగములో మొదలిడి ఛాతి నడిమిలో క్రిందకు దిగి ఉదరవితానములో (విభాజకము; diaphragm) అన్నవాహిక రంధ్రము (esophageal hiatus) ద్వారా ఉదర కుహరము (abdomen) లోనికి ప్రవేశించి జఠరము (stomach) లోనికి అంతము అవుతుంది. ఉదరవితానము ఉరఃపంజరము (chest), ఉదర కుహరములను (Abdomen) విభజించే ఒక కండర పటకము. అన్ననాళము వయోజనులలో సుమారు తొమ్మిది అంగుళముల (28 సెం.మీ) పొడవు కలిగి ఉంటుంది. లోపల శ్లేష్మపు పొరతో (mucous membrane) కప్పబడి ఉంటుంది. ఈ శ్లేష్మపుపొరలో మూడు వరుసుల పొలుసుల కణములు (squamous cells) దొంతరలుగా ఉంటాయి. జఠర శ్లేష్మపు పొరలో ఒక వరుస స్తంభాకార కణములు (columnar cells) ఉంటాయి. అన్న నాళ జఠర సంధాన రేఖ వంకర టింకరగా ఉంటుంది.

అన్ననాళపు శ్లేష్మపు పొరలో నిలువుగా ముడతలు ఉంటాయి. అన్న కబళముతో గాని గాలితో కాని విచ్చుకొని సాగినపుడు ఆ  ముడుతలు

424 ::