పుట:Hello Doctor Final Book.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాటిని జాగ్రత్తగా విసర్జించాలి. ఆపై చేతులను సబ్బునీళ్ళతో కడుగుకొనాలి. ఆ రోగులకు వాడే ఉష్ణమాపకములు (thermometers), వినికిడి గొట్టములు (stethoscopes) ప్రత్యేకముగా వారికొఱకు ఉంచాలి. అట్టి రోగులను వారి గదులనుంచి వివిధ పరీక్షలకు తీసుకువెళ్ళేటప్పుడు వారికి నిలువుటంగీలు, నోటి - ముక్కులకు ఆచ్ఛాదనలు (masks) తొడగాలి. శ్వాసపథ రక్షణ ( Airway protection ) :

శరీరమును ఆక్రమించే చాలా వ్యాధిజనకములు శ్వాసపథము ద్వారా ప్రవేశిస్తాయి. దగ్గులు, తుమ్ములు, మాటల వలన తుంపరుల రూపములో కాని, నిశ్వాసక్రియలో వాయు వాహనులుగా (airborne) గాని వ్యాధి జనకములు వెదజల్లబడి ఇతరుల శ్వాసపథములోనికి  గాలి పీల్చునపుడు ప్రవేశించగలవు.

అందువలన అంటురోగములు (జలుబు, ఇన్ఫ్లుయెంజా, ఆటాలమ్మ (chickenpox) వంటి మనము చిన్న వ్యాధులుగా పరిగణించే వ్యాధులైనా సరే) కలవారు నోటి - ముక్కు కప్పులను ధరించాలి. ఈ చిన్న వ్యాధులు ఆపై నాసికాకుహరములలో తాపము (sinusitis), పుపుస నాళికలలో తాపము (bronchitis), ఊపిరితిత్తులలో తాపములకు (pneumonias) దారితీయవచ్చును. వైద్యశాలలలో వైద్యులు, ఇతరసిబ్బంది, రోగులను సందర్శించేవారు నోటి ముక్కు కప్పులు ధరించుట మేలు.  

విమానములు, ఎ.సి కారులు, ఎ.సి రైళ్ళలో ప్రయాణించునపుడు మూసి ఉంచిన స్థలములలో చాలామంది కలసి, చాలాసమయము గడిపి, చాలాదూరము ప్రయాణిస్తారు. అందువలన ఈ ప్రయాణీకులకు నోటి ముక్కు కప్పుల ధారణ తప్పనిసరి చేసి, ప్రయాణ సాధనములను రోగజనక విధ్వంసకములతో ( disinfectants ) శుభ్రము చేయుట వలన అనేక శ్వాసపథవ్యాధులను నివారించగలము. దూర ప్రయాణీకులు ప్రయాణముల తర్వాత వ్యాధిగ్రస్థులు అగుట వైద్యులు చాలాసారులు గమనిస్తారు.

421 ::