పుట:Hello Doctor Final Book.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇప్పుడు ‘కోవిడ్ 19‘ చైనాలో హుయాన్ నగరములో పొడచూపి ప్రపంచము అంతటా అనతికాలములో బహుళముగా వ్యాప్తిచెందుట చూస్తే, వ్యాధుల వ్యాప్తిని అరికట్టుటలో మన జాగ్రత్తలు చాలవు అనియు, ఆ జాగ్రత్తలు లోప భూయిష్ఠములు అనియు  తెలుస్తుంది.

వైద్యులు, వైద్య రంగములో పనిచేయు సిబ్బంది  అంటువ్యాధుల బారి పడుతూనే ఉంటారు. వీరినుంచి ఆ వ్యాధులు ఇతర రోగులకు కూడా వ్యాప్తిచెందగలవు. అందువలన ఆ రోగముల వ్యాప్తిని అరికట్టుటకు తీసుకోవలసిన జాగ్రత్తలను చర్చిస్తాను. ప్రత్యేక జాగ్రత్తలు దూరము :

మనుజుల మధ్య సాధారణ పరిస్థితులలో కూడా కొంచెమైనా దూరము పాటించుట మేలు. జలుబు, వ్యాపకజ్వరము (Influenza), కోవిడ్ 19 వంటి వ్యాధులను కలిగించు విషజీవాంశములు (viruses) గల తుంపరులు (droplets) 5 మైక్రోమీటరులను మించిన పరిమాణములో ఉంటాయి. ఇవి తుమ్ము, దగ్గు, మాటల తుంపరుల ద్వారా గాలిలో కొద్దిసేపు ఉండి పిదప క్రిందకు భూతలము పైన, వస్తువుల ఉపరితలముల పైన ఒరిగి పోతాయి. అందువలన ఇవి 3 నుంచి ఆరడుగుల దూరము లోపల ఉన్న యితరులకు తుంపరల ద్వారా వ్యాప్తి చెందగలవు. వ్యాధిగ్రస్థుల నుంచి 6 అడుగుల దూరము పాటించుట వలన,

వస్తువులను తాకిన చేతులను సబ్బునీళ్ళతో కాని ఆల్కహాలు గల శుద్ధి పదార్థములతో (sanitizers) కాని శుభ్రము చేసుకొనుటవలన, సబ్బునీళ్ళు లేక ఆల్కహాలు గల శుద్ధి పదార్థములతో శుద్ధి చేసుకొనని చేతులను ముఖముపై చేర్చకపోవుట వలన ఈ వ్యాధులను నివారించవచ్చును. వ్యాధిగ్రస్థులు, తుమ్ములు, దగ్గులు కలవారు నోటికి, ముక్కుకి, ఆచ్ఛాదనములు (కప్పులు masks) ధరించాలి.

వైద్యశాలలలో వీరిని ఒంటరి గదులలో ఉంచాలి. ఈ రోగులకు

418 ::