పుట:Hello Doctor Final Book.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చును. అతినీలలోహిత దీపముతో (Wood’s ultraviolet light) చర్మమును పరీక్షించునపుడు సోబిమచ్చలు తెల్లని బంగారు రంగులో ప్రతిదీప్తిస్తాయి.

చర్మపు పై పొరలను గాజుపలకతో కాని, శస్త్రకారుల చురకత్తితో కాని గోకి వచ్చిన పొట్టుకు పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలు కలిపి సూక్ష్మదర్శినితో పరీక్షించి మధు శిలీంధ్రమును (yeast), శిలీంధ్రపు పోగులను (hyphae) గుర్తించి వ్యాధిని నిర్ణయించవచ్చును. చికిత్స :

సోబికి సెలీనియమ్ సల్ఫైడు (selenium sulphide) షాంపూ 2.5 % ను గాని, 2 % కీటోకొనజోల్ ని (Ketoconazole) గాని పొడి చర్మపుపై లేపనముగా ప్రతిదినము ఒకసారి పూసి పది నిముషములు ఉంచి పిదప కడిగివేస్తూ వారము పది దినములు  చికిత్స చేస్తే సోబి తగ్గుతుంది. సైక్లోపిరాక్స్ (ciclopirox), మికొనజోల్ (miconazole), టెర్బినఫిన్ (terbinafine), క్లోట్రిమజాల్ (clotrimazole) వంటి శిలీంధ్రనాశక లేపనములకు సోబి తగ్గుతుంది. జింక్ పైరిథియోన్ (zinc Pyrithione) సబ్బుతో స్నానము వలన సోబిని అదుపులో ఉంచవచ్చును. నోటి ద్వారా ఫ్లుకొనజోల్ (fluconazole) 150 మి.గ్రా. కాని,  కీటోకొనజోల్ (ketoconazole) 200 మి.గ్రాలు కాని  ఒకే ఒక్క మోతాదుగా గాని, లేక తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి  వారమునకు ఒక సారి చొప్పున నాలుగు వారముల విరామ చికిత్స గాని (Pulse therapy) చేయవచ్చును. గోటి తామర ; నఖ శిలీంధ్రవ్యాధి (Tinea unguium):

శిలీంధ్రములు గోళ్ళను కాని గోటి క్రింద చర్మమును (నఖక్షేత్రము) కాని లేక రెంటినీ కాని ఆక్రమించి గోటి తామర ( నఖ శిలీంధ్రవ్యాధి) కలుగజేస్తాయి. చేతి గోళ్ళలో కంటె కాలి గోళ్ళలో శిలీంధ్ర వ్యాధిని ఎక్కువగా చూస్తాము.

411 ::