పుట:Hello Doctor Final Book.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. అధిక రక్తపీడనము

(Hypertension)

రక్తప్రసరణము వలన దేహములో వివిధ అవయవాలకు, కణజాలమునకు ప్రాణవాయువు (oxygen), పోషక పదార్థములు అందింపబడి, వానినుండి బొగ్గుపులుసువాయువు (Carbon di-oxide), మిగిలిన వ్యర్థపదార్థములు తొలగించబడుతాయి. హృదయ సంకోచ, వికాసముల వలన రక్తనాళముల ద్వారా రక్తప్రసరణము జరుగుతుంది.

హృదయములో ఎడమ జఠరిక (Left Ventricle) రక్తమును వివిధ అవయవములకు బృహద్ధమని (Aorta), దాని శాఖలు, ధమనుల ద్వారా చేర్చితే, వివిధ అవయవముల నుండి తిరిగి ఆ రక్తము ఉపసిరలు, ఊర్ధ్వ బృహత్సిర (Superior Venacava), అధో బృహత్సిరల (Inferior Venacava) ద్వారా హృదయములో కుడి భాగమునకు చేరుతుంది. కుడికర్ణికనుంచి కుడిజఠరికకు, కుడిజఠరికనుంచి పుపుసధమని (Pulmonary artery) ద్వారా ఊపిరితిత్తులకు రక్తము చేరి, ఊపిరి తిత్తులలో వాయువుల మార్పిడి జరిగాక (బొగ్గుపులుసు వాయువు తొలగి, ప్రాణవాయువు కూడి) పుపుససిరల (Pulmonary Veins) ద్వారా రక్త ము గుండె ఎడమభాగానికి చేరుతుంది.

రక్తపీడనము:

రక్తప్రసరణకు కొంత పీడనము అవసరము. హృదయములో జఠరికలు వికసించినప్పుడు (Diastole) రక్తప్రవాహముతో అవి నిండుతాయి. అప్పుడు బృహద్ధమని, పుపుస ధమనుల మూలములలో ఉన్న కవాటములు మూసుకొని ఉంటాయి. అప్పుడు  ధమనులలో ఉండే పీడనమును వికాస పీడనము (Diastolic pressure) అంటారు. జఠరికలు ముడుచుకున్నప్పుడు (Systole) రక్తప్రవాహము వలన ధమనులలో పీడనము పెరుగుతుంది. అప్పటి పీడనమును ముకుళిత పీడనము (Systolic Pressure) అంటారు.

40 ::