పుట:Hello Doctor Final Book.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాచకురుపులు శరీర రక్షణవ్యవస్థ సన్నగిల్లిన వారిలోను, మధుమేహ వ్యాధిగ్రస్థులలోను ఎక్కువగా పొడచూపుతాయి.

సెగగడ్డలను సామాన్య ప్రజలు కూడా చూచి పోల్చగలరు. చూచి, పరీక్షించుటవలన రాచకురుపులను వైద్యులు కనిపెట్టగలరు. చీమును సూక్ష్మజీవుల పెంపకము, ఔషధ నిర్ణయపరీక్షలకు ( culture and sensitivity ) గ్రహించాలి. చికిత్స :

సెగగడ్డలను శుభ్రపఱచి కాపడము పెడితే కొంత ఉపశమనము కలుగుతుంది. చీముతిత్తులను  శస్త్రచికిత్సతో కోసి చీమును తొలగించాలి.  

రాచకురుపులు కలవారిలో  చీముతిత్తులను (abscesses) శస్త్రచికిత్సతో కోసి చీమును తొలగించాలి. వ్యాధి తగ్గక మునుపు గాయము పూడిపోకుండా ఉండుటకై చీముతిత్తుల గాయములలో జీవరహితపు (sterile)  గాజుపట్టీ (gauze ribbon) ఇమిడ్చి కట్లు కట్టాలి. చీముపట్టే గాయాలు లోపలినుంచి మానాలి. పుండు మానేవఱకు ప్రతిదినము గాయమును శుభ్రపఱచి కట్టు మార్చాలి.

5 మి.మీ పరిమాణము కంటె తక్కువ పరిమాణపు సెగగడ్డలకు ఔషధముల అవసరము ఉండదు. సెగగడ్డల పరిమాణము 5 మి.మీ కంటె హెచ్చుగా ఉన్నవారికి, దేహరక్షణ వ్యవస్థ లోపములు (compromised immune system) ఉన్నవారికి, కణజాల తాపము (cellulitis) వ్యాపించి ఉన్నవారికి, రాచకురుపులకు సూక్ష్మజీవ నాశకములు (antibiotics) అవసరము. మిథిసిలిన్ ను ప్రతిఘటించు  ష్టాఫిలోకోకస్ ఆరియస్ కు ( Methicillin Resistant Staphylococcus Aureus -MRSA) తగిన ఔషధములు వాడుట మంచిది. ట్రైమిథోప్రిమ్ / సల్ఫామిథోక్సజోల్ ( Trimethoprim / Sulfamethoxazole ), క్లిండామైసిన్ ( Clindamycin ), డాక్సీసైక్లిన్ (Doxycycline ), లినిజోలిడ్ ( Linezolid ) మందులు నోటిద్వారా ఇచ్చుటకు అందుబాటులో ఉన్నాయి.

389 ::