పుట:Hello Doctor Final Book.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

pro), ఏస్పర్ట్ (aspart), గ్లూలిసిన్ (glulisine) ఇన్సులిన్లు తీసుకొన్న 15-30 నిమిషములలో పనిచేయడము మొదలిడి 3-5 గంటల వఱకు పనిచేస్తాయి. సహజ ఇన్సులిన్ (regular Insulin) 30- 60 నిముషములలో మొదలిడి 6- 8 గంటల వఱకు పనిచేస్తుంది.

మధ్యస్థ ఇన్సులిన్లు (intermediate acting Insulins) : లెంటి (lente), ఎన్.పి.హెచ్ (NPH) ఇన్సులిన్లు 1-2 గంటలలో మొదలిడి 18-24 గంటల వఱకు పనిచేస్తాయి.

దీర్ఘకాలిక ఇన్సులిన్లు (long acting Insulins): డెటమీర్ (Detemir) ఇన్సులిన్ 3-4 గంటలలో పనిచేయడము మొదలుపెట్టి 18-24 గంటలు, గ్లార్గిన్ (glargine) ఇన్సులిన్ 4-6 గంటలలో మొదలిడి 20-24 గంటల వఱకును, అల్ట్రాలెంటి (ultralente) ఇన్సులిన్ 3-4 గంటలలో మొదలిడి 24 గంటల వఱకు పనిచేస్తాయి. ఇన్సులిన్లను సూదిమందుగా చర్మము క్రింద పొట్టలో కాని, తొడలలో కాని, పిఱుదులలో కాని తీసుకోవాలి.

వయోజనులలో రెండవ తరగతి మధుమేహవ్యాధి (Type -2 diabetes) ఇతర ఔషధములతో అదుపులోనికి రానప్పుడు, గర్భవతులలో మధుమేహవ్యాధికి (gestational diabetes), మధుమేహములో కీటోనుల వలన రక్తము ఆమ్లీకృతము అయినపుడు (diabetic keto acidosis), చక్కెర విలువలు చాలా ఎక్కువై అధిక రసాకర్షణ అపస్మారకస్థితి కలిగినపుడు (hyper osmolar coma) చికిత్సకు ఇన్సులిన్లు వాడవలెను. ఇన్సులిన్లు వాడవలసినపుడు ఏ రకములవి ఎంత మోతాదులలో వాడాలో ఒక్కొక్కరికి వ్యక్తీకరించవలసి ఉంటుంది. కొందఱిలో మధ్యస్థ (intermediate) లేక దీర్ఘకాలిక (long acting) ఇన్సులిన్ ఉదయము ఆహారమునకు ముందుగాని, రాత్రి నిద్రకు ముందుగాని దినమునకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.

37 ::