పుట:Hello Doctor Final Book.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జలుబుకు  విషజీవాంశనాశకములు (Antivirals) పరిశోధన స్థాయిలో ఉన్నాయి. ప్లికొనారిల్ (Pleconaril) నాసికా విషజీవాంశములు (rhinoviruses) ముక్కులో శ్లేష్మపుపొర కణములతో సంధానమగుటను అరికడతాయి. అందువలన ఆ జీవాంశములు నాసికాకణముల లోనికి  చొచ్చుకొనవు. వృద్ధిచెందవు. ఉబ్బస వ్యాధిగ్రస్థులలో యీ మందు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. నివారణ :

జలుబు కలిగించే విషజీవాంశములు యితరులకు సులభముగా అంటుకోగలవు. వ్యాధి సోకిన తొలి మూడు దినములలో యివి వ్యాప్తిచెందే అవకాశాలు ఎక్కువ. జలుబు సోకిన మూడుదినములు పాఠశాలలకు, దిన సంరక్షక కేంద్రాలకు పిల్లలను పంపకపోవుట మంచిది. జలుబు ఉన్నవారు తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు నోటికి, ముక్కుకు ఆచ్ఛాదనలను (masks) ధరించడమో, లేక  మోచేతులను అడ్డుపెట్టుకొనుటో చెయ్యాలి. ఇతరులను స్పర్శించరాదు, ఇతరులతో కరచాలనములు చేయరాదు. తఱచు చేతులను కడుగుకొనుట, శుభ్రపఱచుకోని  చేతులతో ముక్కు, నోరు, కళ్ళు స్పర్శించక పోవుట వలన  జలుబులను అరికట్టే అవకాశములు ఉన్నాయి. జన్యు పరివర్తనాలు  (genetic mutations) ఎక్కువగా కలిగే ఈ జలుబు విషజీవాంశములను  టీకాలతో నివారించగలగడము దుస్సాధ్యము.

376 ::