పుట:Hello Doctor Final Book.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దిబ్బడ, నీరు కారుటలను తగ్గించడానికి నాసికా నిస్సాంద్రకములను (Nasal decongestants) వాడవచ్చును. ఇవి ముక్కులో చుక్కలుగాను ( Oxymetazoline nasal drops, Phenylephrine nasal spray, Ipratropium bromide nasal drops ), నోటితో తీసుకొనే ఔషధములుగాను ( Phenylephrine tablets, Pseudoephedrine tablets ) లభ్యము. ఒంటినొప్పులు, నలతలకు ఎసిటెమైనోఫెన్  (Acetaminophen),  పేరెసిటమాల్ (Paracetamol), ఐబుప్రొఫెన్ లు (Ibuprofen) వాడవచ్చును.

లొరటడిన్ (Loratadine), డెస్ లొరటడిన్ (Desloratadine), సెట్రిజెన్ (Cetrizine) వంటి హిష్టమిన్ గ్రాహక అవరోధకములు (Histamine receptor blockers) వలన తొలి, మలి దినములలో కొంత ఉపశమనము కలుగవచ్చును.

గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలింతలు కొంత ఉపశమనమును కలిగించవచ్చును. జింక్ ఖనిజలవణము వలన కొంత ప్రయోజనము కలుగవచ్చును.

జలుబులకు సూక్ష్మజీవి నాశకములను (Antibiotics) వాడకూడదు. వాటికి విషజీవాంశముల పైన ఎట్టి ప్రభావము ఉండదు. వాటి వలన అవాంఛిత ఫలితాలు, వికటఫలితాలు కలుగవచ్చును. అనవసరముగా సూక్ష్మజీవి నాశకములు (Antibiotics) వాడుట వలన వాటికి లొంగని సూక్ష్మజీవులు వృద్ధిచెందుతాయి. చాలా సూక్ష్మజీవి నాశకములు  అందువలన నిష్ప్రయోజనము అవుతున్నాయి. విటమిన్ సి, విటమిన్ డి, తేనెల వలన ప్రయోజనములు నిరూపితము కాలేదు. అలాగే దగ్గుమందుల ప్రయోజనము కూడా శూన్యము. పిల్లలలో ప్రయోజనము లేకపోవుట వలన అవాంఛిత ఫలితాలు కలుగుట వలన డెక్స్ట్రోమిథార్ఫన్ (Dextromethorphan) అనే దగ్గుమందును పలు దేశాలలో నిషేధించారు. జలుబుకి కార్టికోష్టీరాయిడ్ తుంపరమందుల వలన ప్రయోజనము లేదు.

375 ::