పుట:Hello Doctor Final Book.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూస్తాము. వయోజనులలో జలుబుతో పాటు జ్వరము హెచ్చుగా కలుగదు.

ఉబ్బస ఉన్నవారిలో జలుబు కలిగినప్పుడు ఉబ్బస ప్రకోపించవచ్చును. పిల్లలలో జలుబులు మధ్యచెవిలో తాపమునకు (Otitis media) దారి తీయవచ్చును. జలుబు తర్వాత తక్కువ శాతము మందిలో నాసికా కుహరములలోను (Paranasal sinuses) పుపుసనాళికలలోను (Bronchi ), తాపము కలుగవచ్చును. వీటికి గురైనవారిలో వ్యాధి లక్షణములు 20 గంటల నుంచి నాలుగుదినములలో కనిపిస్తాయి. చాలామందిలో రెండు దినములలో వ్యాధి లక్షణములు పొడచూపుతాయి. వారము, పదిదినములలో చాలా మందిలో వ్యాధి లక్షణములు తగ్గిపోయినా  కొంతమందిలో యీ లక్షణాలు రెండు, మూడువారముల వఱకు ఉండగలవు. కొద్దిశాతము మందిలో దగ్గు రెండు మూడువారముల వఱకు ఉండవచ్చు. వ్యాధి నిర్ణయము :

ఒంట్లో నలత, ఒంటి నొప్పులు, ముక్కు కారుట, తుమ్ములు, కొద్దిగా గొంతునొప్పి, పెద్దగా జ్వరము లేకపోవుట జలుబును సూచిస్తాయి.

వ్యాపక జ్వరాలు (Influenza) ఉన్నవారిలో జ్వరము, దగ్గు, ఒళ్ళునొప్పులు ఎక్కువగా ఉంటాయి. తుమ్ములు, ముక్కు కారుట  విపరీతముగా ఉండవు.

ధూళి, పుప్పొడులకు  అసహనములు ( allergies ) ఉండి వాటి బారి పడినవారిలో తుమ్ములు, ముక్కు కారుట ఎక్కువగా ఉంటాయి. వీరికి జ్వరము, ఒళ్ళునొప్పులు, నలత తక్కువగా ఉంటాయి. కళ్ళలో దుఱద, కళ్ళు నీరు కారుట కూడా పదార్థాల అసహనమును ( Allergies )  సూచిస్తాయి. జలుబు ఉన్నవారి నాసికా స్రావములలో విషజీవాంశములను ( viruses ) కనుగొనవచ్చును, కాని వ్యయముతో కూడుట వలన, ప్రయోజనము లేకపోవుట వలన ఆ పరీక్షలు సలుపరు.

చికిత్స : జలుబుకు ఉపశమన చికిత్సలే ఇప్పుడు లభ్యము. ముక్కు

374 ::