పుట:Hello Doctor Final Book.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరంభదశలో గులాబిరంగు లేక ఎఱుపురంగులో దద్దుర్లు వలె కనిపిస్తుంది. ఈ విస్ఫోటము సర్వసాధారణముగా శరీరములో ఒక ప్రక్క ప్రభావిత నాడీపాలిత చర్మవిభాగమునకు (Dermatome) పరిమితమై ఉంటుంది. ఈ విస్ఫోటము శరీర మధ్యరేఖను అతిక్రమించదు. శరీర వ్యాధినిరోధక శక్తి విశేషముగా క్షీణించిన వారిలో ఈ వ్యాధి తీవ్రమయి విశేషవ్యాప్తి చెందవచ్చును. తొలుత దద్దుర్లుగా ఉండి తర్వాత నీటిపొక్కులు ఏర్పడి, ఆ పిమ్మట నల్లబడి, పెచ్చులు కట్టి, తర్వాత పెచ్చులు రాలిపోతాయి. అరుదుగా పుళ్ళు కలిగి, మచ్చలు కూడా కట్టవచ్చును. రెండు, నాలుగు వారములలో విస్ఫోటము మానిపోతుంది. కొంతమందిలో నెలలు లేక కొద్ది సంవత్సరముల పాటు నరాల సలుపు ( Post herpetic neuralgia ) బాధించవచ్చును. ముఖములో మేఖల విసర్పిణి :  

త్రిశాఖనాడిలో (Trigeminal nerve) నేత్రకుహర నాడి (Opthalmic nerve), హనువు నాడి (Maxillary nerve), అధోహనువు నాడి (Mandibular nerve) అను మూడు శాఖలు ఉంటాయి. ఈ మూడు శాఖలలో నేత్రకుహర నాడి అగ్గిచప్పికి తఱచు లోనవుతుంది.

నేత్రప్రాంతములో మేఖల విసర్పిణి కలుగుతే నుదుటి ప్రాంతములోను, కనురెప్పలపైనా ఎఱ్ఱదనము, వాపు, పొక్కులు పొడచూపుతాయి. కంటి పైపొర తాపము వలన కండ్లకలక (Conjunctivitis); స్వచ్ఛపటల తాపము (Keratitis), కృష్ణపటల తాపము (Uveitis), చక్షునాడి వాతములు (Optic nerve palsies) వలన కంటిలో సలుపు, నీరు కారుట, నుదుటి ప్రాంతములో ఒకపక్క తలనొప్పి, దృష్టిలోపములు, అంధత్వము కూడా కలుగవచ్చును. హనువునాడి (maxillary nerve) ప్రభావితమైతే నోటిలో పైదవుడ, అంగుడు, పైదంతపు ఇగుళ్ళలో చిన్న పొక్కులు, పుళ్ళు, పైదవుడ చర్మముపై విస్ఫోటము పొడచూపుతాయి.

369 ::