పుట:Hello Doctor Final Book.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలలోను తరుణ వయస్సు కలవారిలోను అరుదుగా కనిపిస్తుంది. అదివఱకు ఆటాలమ్మ కలిగినవారిలో ఆ విషజీవాంశములు (Viruses) శరీరరక్షణ యంత్రాంగముచే తొలగించబడినా, కొన్ని చర్మమునుంచి జ్ఞాననాడుల ద్వారా నాడీకణముల లోనికి ప్రవేశించి వానిలో నిద్రాణమై మసలవచ్చును.

వెన్నుపామునుంచి వెలువడు నాడులకు పూర్వనాడీ మూలము (ముందఱ ఉండు anterior nerve root), పరనాడీ మూలము (వెనుక నుండు posterior nerve root) ఉంటాయి. పూర్వనాడీ మూలములో చలననాడుల పోగులు (motor nerve fibers) ఉంటాయి. పరనాడీ మూలములలో జ్ఞాననాడుల పోగులు (sensory nrve fibers)  ఉంటాయి. పరనాడీ మూలములలో నాడీకణములతో నాడీగ్రంథులు (nerve root ganglions) ఉంటాయి. ఆటాలమ్మ-మేఖలవిసర్పిణి విషజీవాంశములు (Varicella Zoster Viruses) యీ నాడీగ్రంథుల నాడీకణములలోను, ముఖచర్మము నుంచి స్పర్శ మొదలగు జ్ఞానములను సేకరించు త్రిశాఖనాడీ గ్రంథి (Trigeminal nerve ganglion) లోను నిక్షిప్తమై ఉండగలవు. శరీర వ్యాధినిరోధకశక్తి వయస్సువలన, యితర వ్యాధులవలన, ఔషధములవలన, కర్కటవ్రణముల (cancers) వలన తగ్గినపుడు, యీ విషాంశములు చైతన్యవంతమయి నాడీకణములలో వృద్ధిచెందినచో అవి నాడీతంతువుల ద్వారా చర్మమునకు చేరి చర్మములో తాపము కలిగించి పొక్కులతో మేఖల విసర్పిణి (అగ్గిచప్పి /Shingles /Herpes Zoster) కలుగజేస్తాయి. మేఖల విసర్పిణి లక్షణములు:

మేఖల విసర్పిణి పొడచూపే ముందు శరీరములో నలత, జ్వరము, తలనొప్పి కలుగవచ్చు. కొద్దిదినములకు ముందు ప్రభావితభాగములో తిమ్మిరి, మంట, సలుపు, పీకుట, నొప్పి కలుగవచ్చును. ఛాతి ప్రభావితమైనపుడు ఛాతినొప్పి, ఉదరభాగము ప్రభావితమయితే కడుపునొప్పి కలుగవచ్చును.

ఈ బాధ కలిగిన రెండు మూడు దినములు లేక కొద్దివారముల పిదప ప్రభావిత ప్రాంతములో విస్ఫోటము (rash) కనిపిస్తుంది. ఈ విస్ఫోటము

368 ::